బజారున పడుతున్న శాఖ పరువు
ఉన్నతాధికారుల అవినీతిపై గుర్రు
ఎక్సైజ్‌తోపాటు పోలీసులకు మామూళ్లు
వరంగల్ క్రైం : శాఖలోని కొందరు అవినీతి అధికారుల తీరుతో ఎక్సైజ్ శాఖ పరువు బజారున పడుతోంది. మద్య దుకాణాల నుంచి డబ్బులు గుంజడమే కాకుండా.. సొంత శాఖలోని ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు లాగుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కిందిస్థారుు ఉద్యోగులు. దీనిపై ఏకంగా ఉన్నతాధికారుల అవినీతికి సంబంధించి కరపత్రాలు కూడా విడుదల చేశారు. ఉన్నతాధికారులు అవినీతికి ఎలా పాల్పడుతున్నారు.. ఎక్కడి నుంచి ఎంతెంత వసూలు చేస్తున్నారనే విషయమై కరపత్రాలు పంచుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ పరువు బజారున పడుతోంది. ఒక శాఖలోని ఉద్యోగులు అదే శాఖలోని ఉన్నతాధికారులపై విరుచుకుపడుతున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శాఖలోని అధికారులు బయట మద్యం షాపులు, గుడుంబా కేంద్రాల నుంచి వచ్చే మామూళ్లు చాలవు అన్నట్లు సొంత శాఖలో చిన్నచిన్న పనులకు కూడా ఆశపడుతున్నారు. పైసలిస్తే కాని ఫైలు కదలని దుస్థితికి ఎక్సైజ్ శాఖ చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటు స్టేషన్లు, అటు లిక్కర్ ప్లాంట్లలో కూడా అవినీతి తాండవిస్తోంది. లిక్కర్ ప్లాంట్‌లో అధికారులైతే మరీ బరితెగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. డబ్బులు ఇవ్వనిదే సరుకు ఇచ్చే ప్రసక్తి లేదంటూ ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. దీంతోపాటు గుడుంబా కేంద్రాలు, నల్లబెల్లం అమ్ముకునేవారు ఇలా ప్రతీ ఒక్కరి వద్ద నుంచి మామూళ్లు దండుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వని వారిపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు.
ఎంత మందికి మామూళ్లు ఇవ్వాలి?
ఒక మద్యం దుకాణం యజమాని ఎంత మందికి మామూళ్లు ఇవ్వాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతీ నెల మొదటి తేదీన ఠంచన్‌గా మామూళ్లు అప్పజెప్పాల్సి ఉంటుంది. తేడాలు వస్తే రాత్రి వేళల్లో తమ ప్రతాపం చూపిస్తారు. ఒక మద్యం దుకాణం యజమాని ప్రతీ నెల ఎక్సైజ్, పోలీసు శాఖకు ప్రతీ నెల ముట్టజెప్పాల్సిందే. ఇటీవల వరంగల్, హన్మకొండలో పోలీసులు మామూళ్ల రేట్లను డబుల్ చేశారు. గతంలో రూ.6 నుంచి రూ.8వేలు బార్ షాపునకు ఉండేది. ఇప్పుడు రూ.12వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. అదేవిధంగా వైన్స్ నుంచి గతంలో రూ.6వేల వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.9వేలు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల నుంచి వచ్చే మామూళ్లను డీఎస్పీ, సీఐ, ఎస్సైలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక డబ్బులు ఇవ్వని మద్యం దుకాణం పరిస్థితి అంతే. దీంతోపాటు కొందరు పార్టీల పేరుతో మద్యం షాపు యజమానులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఇలా లక్షలాది రూపాయలు మామూళ్లు ఇస్తూ వ్యాపారం చేస్తున్న యజమానులు నష్టాన్ని పూడ్చుకోవడానికి మద్యం కల్తీ చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకవేళ పోలీసు, ఎక్సైజ్‌తోపాటు ఇతరులు మామూళ్లకు దూరంగా ఉన్న పక్షంలో మద్యంషాపు యజమానికి కల్తీ చేయాల్సిన అవసరం రాదోమో అనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్లుకు దూరంగా ఉంటూ.. విధి నిర్వహణలో కచ్చితంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
ఆబ్కారీ.. అడ్డదారి..
Published Fri, May 15 2015 1:16 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement