ఉంటావో.. వెళ్తావో తేల్చుకో..! | costitution representetive fires on deo in karimnagar district | Sakshi
Sakshi News home page

ఉంటావో.. వెళ్తావో తేల్చుకో..!

Published Tue, Aug 18 2015 6:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

జిల్లా విద్యాశాఖ అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  •    డీఈవో శ్రీనివాసాచారిపైఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆగ్రహం
  •      సెలవులో వెళ్లిన డీఈవో.. అదేబాటలో ఏడీ
  •      ఇన్‌చార్జి డీఈవోగా జెడ్పీ ఉప విద్యాధికారి కట్టా ఆనందం
  •  కరీంనగర్ :
     జిల్లా విద్యాశాఖ అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో తన నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానాల్లో కొనసాగించాలని డీఈవోను ఆదేశించినట్టు తెలిసింది. డీఈవో అందుకు ససేమిరా అనడంతో సదరు ప్రజాప్రతినిధి తన మాటే వినడం లేదని తీవ్రంగా మండిపడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డీఈవో బదిలీపై వెళ్లినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


     జిల్లా విద్యాశాఖ అధికారిగా జూన్ 19న బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసాచారి వచ్చి రాగానే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ షెడ్యూల్ వెలువడడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి తాకిడి అక్కడి నుంచే మొదలైంది. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించారు. రేషనలైజేషన్ ద్వారా ఉన్న చోట నుంచి దూరప్రాంత పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను యథా స్థానాల్లోనే కొనసాగించాలని ఒత్తిళ్లు రావడం, డీఈఓ అందుకు ససేమిరా అనడంతో వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. చివరకు డీఈవో  సెలవుపై వెళ్లేంత వరకు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరు మహదేవపూర్‌కు, మరొకరు మెట్‌పల్లికి, ఇంకొకరు కథలాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. సదరు ప్రజాప్రతినిధి ఈ ఉపాధ్యాయులు యథా స్థానంలోనే కొనసాగేలా కొద్దిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డీఈఓపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక దశలో 'నేను చెబితే పని చెయ్యవా... ఉంటావో.. వెళ్తావో తేల్చుకో... రెండు రోజుల్లో వారి బదిలీని రద్దు చేసి యథా స్థానాలకు పంపాలి..'అంటూ హుకుం జారీ చేశారని తెలిసింది. దీనికి డీఈఓ తలొగ్గకపోవడంతో 'బ్లడీపూల్... నేను చెబితే చెయ్యవా..'అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక చేసేదేమీ లేక డీఈవో సెలవు పెట్టి అధికారిక సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ను సైతం వదిలివెళ్లడం గమనార్హం. డీఈఓ శ్రీనివాసాచారికి కొద్దిరోజుల్లోనే ఆర్‌జేడీగా ప్రమోషన్ వచ్చే ఆవకాశం ఉండడంతో ఇలాంటి తప్పిదాలకు పాల్పడి ఆనవసర వివాదాల్లో తలదూర్చడం కన్నా కొద్దిరోజుల పాటు సెలవులో ఉండడమే మంచిదని తన సన్నిహితులతో చెప్పి సెలవులో వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగు రోజులే సెలవు పెట్టినా మళ్లీ సెలవులను పొడగించుకొని ఇక్కడికి రాకుండా ఉండేందుకే హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే అధికారులపై ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
     ఏడీ కూడా సెలవులోనే... అంతా ఇన్‌చార్జీలే...
     డీఈఓ తరువాత విద్యాశాఖలో కీలకంగా ఉండే ఏడీ ప్రసాద్ కూడా ఐదు రోజుల క్రితమే సెలవు పెట్టి కరీంనగర్ నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో హైదరాబాద్ ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యాశాఖను గాడిలో పెట్టాల్సిన డీఈఓ, ఏడీలు లేకపోవడంతో విద్యాశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు ఉప విద్యాధికారులు ఆరుగురు, ఇటు మండల విద్యాధికారులు 54 మంది ఇన్‌చార్జీలే కావడంతో విద్యాశాఖ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.
     ఇన్‌చార్జి డీఈఓగా కట్టా ఆనందం...
     జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారిగా జెడ్పీ ఉప విద్యాధికారిగా పనిచేస్తున్న కట్టా ఆనందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆనందంకు హుజూరాబాద్ ఉప విద్యాధికారిగా, జెడ్పీ ఉప విద్యాధికారిగా, కరీంనగర్ ఉప విద్యాధికారిగా, ఇటు ఇన్‌చార్జి డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఏ మేరకు విద్యాశాఖకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement