సాక్షి, ఆర్మూర్: సార్వత్రిక ఎన్నికల్లో కొత్త కొత్త సమస్యలు అభ్యర్థులుగా తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. అప్పటి దాకా వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్లేటు ఫిరాయిస్తుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదే సమయంలో తమ వెంట ఉన్న వారిలో కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తూ సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరాలకు చేర వేస్తుండడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు కోవర్టుల తలనొప్పి ఉంది. స్థిరత్వం లేకుండా అభ్యర్థుల ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం ఉన్న పార్టీలోనే కొనసాగుతూ అక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేర వేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచర గణంతో చర్చించి ఏ గ్రామంలో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరిని ప్రలోభాలకు గురి చేస్తే తమకు లాభం చేకూరుతుంది అనే అంశాలపైచర్చించుకుంటున్నారు. మద్యం, విందులు, డబ్బుల పంపిణీపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ చర్చల్లోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకొని తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని చేర వేస్తున్నారు. దీంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి శిబిరానికి చెందిన నాయకులు వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ, వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు.
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఉన్న కొద్ది రోజులను సద్వినియోగం చేసుకొని గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలనుకుంటున్న అభ్యర్థులు కోవర్టులపై పెద్దగా దృష్టి సారించలేక పోతున్నారు. మరో వైపు అభ్యర్థి శిబిరంలో జరుగుతున్న తాజా వ్యవహారాలను కోవర్టులు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి శిబిరానికి చేర వేస్తున్నారు. ఎవరైనా వ్యక్తి అభ్యర్థిని కలవడానికి వారి పార్టీ శిబిరానికి వస్తే, ఆ సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి శిబిరానికి చేరిపోతోంది. వెంటనే సదరు నాయకులు ఆ వ్యక్తికి లేదా అతని కుటుంబ సభ్యులను సంప్రదించి వారిని బుజ్జగించి పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటున్నారు. కుల సంఘాల ప్రతినిధులు ఇరు వర్గాల వారిని కలిసి లాభపడాలనే ఆలోచనతో వస్తే.. ఇలాంటి వారిని కూడా గుర్తించడానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. ఏదేమైనప్పటికీ సార్వత్రిక ఎన్నికలు అభ్యర్థులు, ప్రత్యర్థుల ఎత్తులు, చిత్తులతో చిన్నసైజు యుద్ధాలనే తలపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment