రక్తదానం చేస్తున్న సంపత్‌కుమార్ (ఫైల్), చిరంజీవి నుంచి సర్టిఫికెట్ అందుకుంటూ... (ఫైల్)
మున్నెన్నడూ ఎరుగని రోగమది. కనీ విని ఎరుగని రీతిలో కష్టాలను, నష్టాలను చవిచూపిస్తున్న కరవు కాలమిది. ఒకవైపు బతుకు బండి సాగేదెలా అనే బెంగ.. మరోవైపు నలువైపులా చీకట్లు ముసురుకుంటున్న వేళ కొన్ని మానవత్వపు చిరుదీపాలు వెలుగుతున్నాయి. మందేలేని వ్యాధి అంటుతుందేమోననే భయంతో చేతనైనంత సాయం చేçస్తూ వెలుగు పంచుతున్నారు. అలాంటి చిరు దీపాలకు చిరు సత్కారం అందనుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి సేవ చేసిన పలువురికి ప్రముఖ సోషల్ ఆక్టివిస్ట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కోవిడ్–19 ఫైటర్స్ అవార్డ్ ఇవ్వనున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూశాం. మరెన్నో ప్రాణాంతక వ్యాధులను దాటుకుని వచ్చాం. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక వ్యాధి ప్రపంచాన్నే ఇంటికి పరిమితం చేయడమే కాకుండా మనిషికి మనిషికి దూరాన్ని సైతం పెంచింది. కరోనా వ్యాధి సోకి మృత్యువాత పడినవారు కొందరైతే, దాని అవస్థల నుంచి కోలుకుంటున్న వారు మరికొందరు. అయితే ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే... మరో వైపు పరోక్షంగా ఇది సృష్టిస్తున్న విధ్వంసం అసాధారణం.
లాక్‌డౌన్.. ఆకలి అప్
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చేతిలో పని లేక, అవసరానికి డబ్బులు అందక, కనీసం తినడానికి తిండి దొరక్క పస్తులుంటున్న ఆకలి కడుపులెన్నో. ఈ తరుణంలో ఎన్నో ఆపన్న హస్తాలు అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఉన్నంతలో సాటి వారికి చేయూత అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ కష్టకాలంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్. ముఖ్యంగా అన్నార్తులకు ఆహారం, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఈ సేవలో కరోనా సోకే ప్రభావం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక విధంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సేవ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయం చేయాలని ఉన్నా లాక్‌డౌన్ కారణంగా బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో వారందరూ సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు డబ్బులు పంపించి ఉదారతను చాటుకుంటున్నారు. మరికొందరు స్వయంగా ముందుకొచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సేవ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 100 మందిని ఈ కోవిడ్–19 ఫైటర్ అవార్డ్స్‌తో పాటు నగదు బహుమతితో, ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నామని సంపత్ కుమార్ తెలిపారు. వీరిలో విభిన్న రకాలుగా సేవ చేసిన వారిని ఎంచుకున్నామన్నారు.
సంపత్ కేరాఫ్ చారిటీ...
సమాజంలో ఎవరికి ఏ అవసరమున్నా నేనున్నాను అని ముందుంటాడు సంపత్ కుమార్. అంతేకాకుండా ఇప్పటి వరకు 211 సార్లు రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమున్నవారికి అండగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. లాక్‌డౌన్‌లో కూడా వ్యక్తిగతంగా దాదాపు 2000 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందించాడు. దానితో పాటు సోషల్ మీడియాలో ఎఫ్3 ఛాలెంజ్‌ని (ఫిడ్ ఫైవ్ ఫ్యామిలీస్) విసిరి, దాని ద్వారా పోగైన లక్ష రూపాయలతో సిటీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించాడు. అంతేకాకుండా ఈ క్లిష్టపరిస్థితుల్లో తలసేమియాతో బాధ పడేవారికి రక్త నిల్వల కొరత ఉండకూడదని, తన సోసల్ మీడియా ఫాలోవర్స్ ద్వారా 700 యూనిట్‌ల రక్తాన్ని ముందుగానే సమకూర్చాడు. దీని కోసం ప్రత్యేకంగా బ్లడ్ అంబులెన్స్‌ని ఏర్పాటు చేశాడు. అలాగే నగరంలో ఎవరికి రక్తం అవసరమున్నా తనకున్న ఫాలోవర్స్ ద్వారా వెంటనే అందిస్తూ అందరికి ఆదర్శంగా, ఆపద్భాందవుడిగా నిలుస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment