
'సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘కోవిడ్–19’ వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తికి పాజిటివ్ అని తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీవీలు, ఇతర మీడియా ద్వారా విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. కరోనా బాధితుడు ప్రస్తుతానికి ఒక్కడే అని తేలినా...ఆ వ్యక్తి నగరంలోని దాదాపు 80 మందితో క్లోజ్‌గా తిరిగినట్లుగా తెలుస్తోంది. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాడు...ఏ వాహనం ఉపయోగించాడు... జనసమర్థం ఎక్కువగా ఉన్న సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లాడా..మిత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లాడా...వారి కుటుంబ సభ్యులతో ఒకే ఇంట్లో గడిపాడా...వంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
నిలకడగా కరోనా బాధితుని ఆరోగ్యం..
వేసవి ప్రారంభమై పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరడంతో హీట్‌కు వైరస్ మనుగడ సాధించలేదని ఇప్పటివరకు భావించారు. కానీ వాతావరణంలోని టెంపరేచర్‌తో సంబంధం లేకుండా వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ బాధితుడి (24) నుంచి ఆ తర్వాత ఎంత మందికి వైరస్ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిని గుర్తించడం వైద్య ఆరోగ్యశాఖకు కష్టతరంగా మారింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయట పడేందుకు 2 నుంచి 14 రోజుల సమయం పడుతుండటం, ఆ లోపు మరింత మందికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక బాధితుడు నివాసం ఉన్న సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లో జనం భయపడుతున్నారు. తమలో ఎవరికైనా వైరస్ సోకిందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం ఈ ఏరియాలో జనసంచారమే కన్పించలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇక్కడ పారిశుధ్య చర్యలు చేపట్టారు.
మారేడుపల్లి: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మొదటి కేసుగా మహేంద్రహిల్స్ రవి కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా వైరస్ (కోవిడ్–19) నిర్ధారణ కావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. మంగళవారం కాలనీలో నిర్మానుష్య వాతావరణం కన్పించింది. వైరస్ సోకిన వ్యక్తి ఐదు రోజుల క్రితం కాలనీలో ఎటువంటి మాస్క్ ధరించకుండా సంచరించాడని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడితో పాటు ఇంట్లో అతడి తల్లిదండ్రులు ఉంటారు. వారిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. కరోనా బాధితుడి నివాసానికి చుట్టుపక్కల ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు. రవి కాలనీతో పాటు త్రిమూర్తికాలనీ, వైజయంతి కాలనీ, బాలంరాయి సొసైటీ తదితర ప్రాంతాల్లో కూడా కరోనా అంశం చర్చనీయాంశమైంది.
మహేంద్రా హిల్స్‌లో భయం భయం
మెట్రో సిబ్బందికి కరోనా అలర్ట్
మెట్రో సిబ్బందికి కరోనా వైరస్‌పై పూర్తి అవగాహన కల్పించామని, పరిశుభ్రత చర్యలు చేపట్టాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లు ఎస్కలేటర్లు, ప్రయాణికులు రైల్లో పట్టుకొని నిలబడే పరిసరాలను రాత్రి వేళల్లో పరిశుభ్రంగా డిటర్జెంట్లతో శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో రైలు స్టేషన్లలో అనౌన్స్ మెంట్లు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కంటోన్మెంట్ సిబ్బంది అలర్ట్
మారేడుపల్లి: మహేంద్రహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కావడంతో కంటోన్మెంట్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు మంగళవారం రవికాలనీలో పారిశుధ్ధ్య చర్యలు చేపట్టారు. శానిటేషన్ విభాగం అధికారులు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్, లైవ్‌పౌడర్, మలేరియా నివారణ మందు స్ప్రే చేశారు. చెత్త చెదారాన్ని తొలగించారు. కంటోన్మెంట్ శానిటేషన్, హెల్త్ విభాగం అధికారులు కరోనా బాధితుడి నివాస పరిసర ప్రాంతాలను సందర్శించారు. చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్ సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాధిని నిరోధించవచ్చునన్నారు.
(చదవండి: కోవిడ్ కట్టడికి 100 కోట్లు)
ఉమ్రా యాత్రకు బ్రేకులు..
ముస్లింల ఉమ్రా యాత్రకు బ్రేక్ పడింది. సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. కరోనా నేపథ్యంలో మక్కా, మదీనా సందర్శన గత వారం రోజులుగా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉమ్రా యాత్రికులను ఏకంగా విమానాశ్రయాల నుంచే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏటా ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా ప్రార్థనల కోసం వేలాది మంది వెళ్ళివస్తుంటారు. ఉమ్రా వీసాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో యాత్రలు సైతం వాయిదా పడి ట్రావెల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు సౌదీ ఆరేబియాకు విజిట్ వీసా కూడా నిలిచిపోయింది. ఈ ఏడాది జూలై చివర్లో ప్రారంభం కానున్న హజ్ యాత్రపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
బంజారాహిల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్ లోని చైనా ఆహార పదార్థాలు అందించే హోటళ్లు గత నాలుగైదు రోజులుగా వెలవెలబోతున్నాయి. చైనాకు చెందిన పలు ప్రాచైజీలు హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌళి, సికింద్రాబాద్, మాదాపూర్, హిమాయత్‌నగర్, సుచిత్ర, కేపీహెచ్‌బీ కాలనీల్లో కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 లోనూ చైనా రుచులతో కూడిన మరో హోటల్ నడుస్తోంది. చైనాకు చెందిన చైన్ గ్రూప్ కావడంతో మసాలా దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని చైనా నుంచే తెప్పిస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ హోటల్‌లకు గిరాకీ తగ్గుముఖం పట్టింది. సోమవారం ఏకంగా నగరంలో కరోనా కేసు నమోదు కావడంతో మంగళవారం ఈ హోటళ్లకు వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. నగరంలోని పలు చైనీస్ రెస్టారెంట్లలో చైనా, మణిపాల్, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువతీ, యువకులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో వీరందరూ భయాందోళనకు గురౌతున్నారు.
చైనీస్ హోటళ్లు వెలవెల
బస్సులో ఉన్నప్పుడు వైరస్ లేదు!
గల్ఫ్ రిటర్న్స్‌కు కరోనా దడ..!
చాంద్రాయణగుట్ట: హైదరాబాదీ గల్ఫ్ రిటర్న్స్‌కు కోవిడ్–19 ( కరోనా) భయం పట్టుకుంది. దుబాయ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. పాతబస్తీకి చెందిన పలువురు దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, లండన్ తదితర దేశాలకు వెళ్లి వస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా విమానాశ్రయాల్లో ఆయా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, కోవిడ్–19 ప్రభావం తీవ్రంగా ఉండడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. గల్ఫ్‌దేశాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా రావాల్సి ఉండటంతో దుబాయ్ విమానాశ్రయంలో నిలిపి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో గంటల కొద్ది ఆలస్యం జరుగుతోంది. రెండు రోజుల క్రితం బార్కాస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందగా, అతడి కుమారుడు లండన్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వచ్చేందుకు ప్రయత్నించగా దుబాయి విమానాశ్రయంలో ఏడు గంటలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏ పరిస్థితుల్లోనైనా సేవలందిస్తాం
కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వంతో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యవృత్తిలోకి వచ్చిన రోజే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైద్యసేవలు అందిస్తామని చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాం. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న మా తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ నా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు.
– నిహారిక, ఎంబీబీఎస్ విద్యార్థిని
వైరస్ ప్రభావం తగ్గాకే వస్తా
కోవిడ్ వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతే గాంధీ ఆస్పత్రికి వస్తాను. మంగళవారం ఓపీ విభాగంలో చూపించుకునేందుకు ఇక్కడికి వచ్చాను. తీరా వచ్చాక కోవిడ్ వైరస్ అంటూ అందరూ భయపెడుతున్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే నాకు కూడా భయం వేస్తోంది. తక్షణమే గాంధీ ఆస్పత్రి ప్రాంగణం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను. అన్నీ సర్దుకున్నాక వచ్చి డాక్టర్లకు చూపించుకుంటాను. అప్పటి
వరకు ఇక్కడికి రాకవపోవడమే ఉత్తమం అనుకుంటున్నా.
– సతీష్, ఫిల్మ్‌నగర్
ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు
గల్ఫ్ రిటర్న్స్ రాకపోకలు వాయిదా వేసుకుంటున్నారు. దుబాయి, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు కరోనా భయంతో సెలవుల్లో ఇక్కడికి రావడానికి, వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి భయపడుతున్నారు. అత్యవసర పరిస్ధితుల్లో సైతం రాకపోకలకు ఇబ్బందిగా మారింది. విమానాశ్రయాల్లో పకడ్భందీ చర్యలు చేపట్టినా... కరోనా భయం మాత్రం వణికిస్తోంది.
–గులాం ఆహ్మద్ ఖాద్రీ , సైదాబాద్
స్వదేశానికి రాలేక పోతున్నా
దుబాయ్, ఆస్ట్రేలియాలో హోటళ్ల వ్యాపారం ఉంది. వారం రోజులు దుబాయ్‌లో ఉన్నా. ఇక్కడ కరోనా భయం తీవ్రంగా ఉంది. దీంతో ఆస్ట్రేలియాకు వచ్చాం. ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉంది. ఇండియాకు వెంటనే రావాలనుకున్న అనుకూలించడం లేదు.
– మహ్మద్ బా ఉస్మాన్, బార్కాస్
Comments
Please login to add a commentAdd a comment