టీకా శుభారంభం | Corona Vaccine To Give First For Sanitation Workers Kistamma In Gandhi Hospital | Sakshi
Sakshi News home page

టీకా శుభారంభం

Published Sun, Jan 17 2021 3:03 AM | Last Updated on Sun, Jan 17 2021 10:58 AM

Corona Vaccine To Give First For Sanitation Workers Kistamma In Gandhi Hospital - Sakshi

వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి టీకాను గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వేస్తున్న వైద్యులు. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు శనివారం దేశవ్యాప్తంగా మొదలైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రాష్ట్రంలోనూ శుభారంభమైంది. తెలంగాణవ్యాప్తంగా తొలిరోజు టీకాల కార్యక్రమం విజయవంతమైంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని తిలక్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ముందు వరుసలో నిలిచిన గాంధీ ఆసుపత్రిలో శనివారం ఉదయం 10:30 గంటలకు ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు వైద్యులు తొలి టీకా వేశారు. అలాగే నిమ్స్‌లో తొలి టీకాను ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు చంద్రకళ, తిలక్‌నగర్‌ యూపీహెచ్‌సీలో ఆయాగా పని చేస్తున్న రేణుక తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్‌ తమిళిసై దంపతుల సమక్షంలో ఓ లబ్ధిదారుడికి టీకా వేస్తున్న సిబ్బంది. 
తీవ్ర దుష్ప్రభావాలు రాలేదు..
తెలంగాణవ్యాప్తంగా మొత్తం 140 ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఆక్స్‌ఫర్డ్‌–సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలను లబ్ధిదారులకు ఇచ్చారు. తొలిరోజు 4,296 మందికిగాను 3,962 మంది (92.22 శాతం మంది లబ్ధిదారులు) టీకా వేసుకున్నారు. 33 జిల్లాలకుగాను 16 జిల్లాల్లో నూటికి నూరు శాతం మంది లబ్ధిదారులు టీకా వేసుకున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. టీకా వేసుకున్న లబ్ధిదారులకు తీవ్రమైన దుష్ప్రభావాలేవీ రాలేదని, కేవలం 11 మందిలో ఇంజక్షన్‌ ఇచ్చిన చోట కాస్త నొప్పి, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం వంటి స్వల్ప సైడ్‌ ఎఫెక్ట్స్‌ మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు.

టీకా వేసుకున్నానంటూ బొటనవేలిపై ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపుతున్న డీఎంఈ రమేశ్‌రెడ్డి, వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ అంటూ విజయ చిహ్నం చూపుతున్న ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, నార్సింగి పీహెచ్‌సీలో మంత్రి సబిత, ఎంపీ  రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు
టీకా సురక్షితమని రుజువైంది...
రాష్ట్రవ్యాప్తంగా 92 శాతానికిపైగా లబ్ధిదారులు తొలిరోజు టీకా వేసుకోవడం, ఎక్కడా సీరియస్‌ రియాక్షన్లు రాకపోవడంతో వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనని రుజువైందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం వ్యాక్సినేషన్‌ తీరును విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైన తర్వాత సరిగ్గా 321 రోజులకు టీకా వేయడం చరిత్రాత్మకమన్నారు. అన్నిచోట్లా వైద్య సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి టీకా వేసుకున్నారని వివరించారు. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, మాజీ సంచాలకుడు డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్, ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగేందర్‌ తదితరులు కూడా తొలిరోజు టీకా వేసుకున్నట్లు వివరించారు.

తిలక్‌నగర్‌లోని అర్బన్‌ పీహెచ్‌సీలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీకా తీసుకుంటున్న ఆయా రేణుక 
వెంటనే రక్షణ లభించదు...
వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి వెంటనే వైరస్‌ నుంచి రక్షణ లభించదని డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మొదటి డోసు తర్వాత 28 రోజులకు మరో డోసు వేసుకోవాలని, మొదటి డోసు నుంచి 42 రోజుల తర్వాతే వైరస్‌ నుంచి పూర్తి రక్షణ వస్తుందన్నారు. ఆ తర్వాత కూడా లబ్ధిదారులు కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు. అప్పుడు ఒకవేళ వైరస్‌ బారినపడినా వారి నుంచి ఇతరులకు వ్యాపించదన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు రెండ్రోజులపాటు మద్యం తీసుకోవద్దని, ఆహార నియమాలు పాటించాలని కోరారు. టీకా కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారందరినీ అరగంటపాటు పరిశీలనలో ఉంచామన్నారు. వారిని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. సాధారణ ప్రజలు టీకా నమోదు ఎప్పటి నుంచి చేసుకోవాలన్న విషయంపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. సందేహాలు, సలహాల కోసం 104 నంబర్‌ను సంప్రదించాలన్నారు. 

947 మందికి గ్రేటర్‌లో.. 
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ఉన్న 34 సెంటర్లలో తొలిరోజు మొత్తం 1,020 మంది లబ్ధిదారులకుగాను 947 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 73 మంది వ్యక్తిగత కారణాలతో టీకా కేంద్రాలకు రాలేదు. టీకా వేయించుకున్న వారిలో కొందరికి స్వల్ప నొప్పి, వాపు సమస్యలు తలెత్తగా వారికి వెంటనే ఆయా ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నార్సింగి ఆరోగ్య కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

100% టీకాలు  నమోదైన జిల్లాలు
1) ఆదిలాబాద్, 2) జనగాం, 3) జయశంకర్‌ భూపాల్‌పల్లి, 4) గద్వాల 5) కరీంనగర్‌ 6) కొమురం భీం 7) మహబూబ్‌నగర్‌ 8) మంచిర్యాల 9) నాగర్‌కర్నూల్‌ 10) నిర్మల్‌ 11) నిజామాబాద్‌ 12) రాజన్న సిరిసిల్ల 13) వికారాబాద్‌ 14) వనపర్తి 15) వరంగల్‌ అర్బన్‌ 16) యాదాద్రి

గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఈటల. చిత్రంలో కిషన్‌రెడ్డి, సీఎస్‌ తదితరులు
వ్యాక్సిన్‌ ఉచితంగా అందిస్తాం
దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాం. వ్యాక్సిన్‌ రూపొందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఆయా సంస్థలకు కృతజ్ఞతలు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా రెండో డోస్‌ తీసుకోవాలి.
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి

వైరస్‌కు ఎండింగ్‌
వ్యాక్సిన్‌ రాకతో వైరస్‌కు ఎండింగ్‌ వచ్చింది. రెండో డోస్‌ నాటికి ప్రపంచంలోనే అత్యధిక వాక్సిన్‌ పంపిణీ దేశంగా భారత్‌ నిలుస్తుంది. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్ల కృషి అభినందనీయం. ప్రధాని సూచన మేరకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ టీకా తీసుకున్న తర్వాతే ప్రజలతో కలసి వ్యాక్సిన్‌ తీసుకుంటా. వ్యాక్సిన్‌పై అపోహలు, ఆందోళన వద్దు. – గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

కరోనాకు చరమగీతం
కరోనా టీకా విజయవంతం కావడంతో కరోనాకు చరమగీతం పాడిæనట్లయింది. వ్యాక్సినేషన్‌ నిరంతర ప్రక్రియ. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో దశలవారీగా టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి కూడా వ్యాక్సిన్‌ అందిస్తాం. – వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

భవిష్యత్తుకు భరోసా..
కరోనా టీకా భవిష్యత్తుకు భరోసా కల్పించింది. టీకా తయారీలో హైదరాబాద్‌ హబ్‌గా మారింది. ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం. ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మొదటి దశలో వ్యాక్సిన్‌ వేసుకోవట్లేదు. మాకు ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడే వ్యాక్సిన్‌ వేసుకుంటాం. 
– మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు

అదృష్టంగా భావిస్తున్నా
తొలి టీకాకు నన్ను ఎంపిక చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు కల్పించిన భరోసా, ధైర్యంతోనే తొలి టీకా తీసుకొనేందుకు ముందుకొచ్చా. టీకా తీసుకున్నాక సమస్యలేవీ రాలేదు. హెల్త్‌ వర్కర్లంతా ధైర్యంగా టీకా వేసుకోవాలి.
– గాంధీ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికురాలు, తెలంగాణలోనే తొలి టీకా తీసుకున్న కిష్టమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement