ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 ఎఫెక్ట్ శుభకార్యాలపై కూడా పడింది. వివాహ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ ఘనంగా జరుపుకుందామని భావించిన ఓ జంట కరోనా భయంతో ఫంక్షన్‌ను వాయిదా వేసుకుంది. ఈ సంఘటన చింతల్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే గోపాల్ రెడ్డి, భారతీ దంపతులు తమ 25వ పెళ్లిరోజు వేడుక (సిల్వర్ జుబ్లీ)ను గురువారం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హైదరాబాద్‌లో కరోనా తొలి కేసు నమోదు కావడంతో వారు అప్రమత్తమయ్యారు.
(చదవండి: కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్)
ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. బంధువులు, స్నేహితులకు ఈ మేరకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కరోనా భయాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఫంక్షన్‌ను వాయిదా వేసుకున్నామని గోపాల్‌రెడ్డి తెలిపారు. వేడుక నిర్వహణకు ఫంక్షన్ హాల్, కేటరింగ్, షాపింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ.. వచ్చిన అతిథులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వేడుక రద్దు చేసుకున్నామని చెప్పారు.
‘మిలాన్’పై కోవిడ్ ప్రభావం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కోవిడ్ 19 ప్రభావం భారత నౌకాదళంపైనా పడింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్ –2020ని వాయిదా వేస్తున్నట్లు భారత నౌకాదళం మంగళవారం ప్రకటించింది. మిలాన్–2020 పేరుతో ఈ విన్యాసాల్ని విశాఖపట్నంలో ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు పంపించింది.
(చదవండి: తూర్పుగోదావరిలో కరోనా కలకలం!)
ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశముంది. అయితే.. కోవిడ్ వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తుండటంతో మిలాన్‌ని వాయిదా వేస్తే మంచిదని రక్షణ శాఖ నిర్ణయించింది. వివిధ దేశాల సైనిక బృందాలు రాకపోకలు సాగించనున్న కారణంగా కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
(చదవండి: వారికి కరోనా సోకలేదు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment