
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 2న ప్రారంభమై, 12న జరిగే నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటు కోసం చందాలు వసూలు చేయడం పరిపాటి. దీనిని అదనుగా తీసుకుని కొన్ని అసాంఘికశక్తులు చందాల వసూలు పేరుతో దౌర్జన్యాలకు తెగబడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎవరైనా చందాల పేరుతో దౌర్జన్యాలకు దిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నగరంలో మండపం ఏర్పాటు చేసేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, పూర్తి చేసిన దరఖాస్తులను 29లోగా తిరిగి ఠాణాల్లోనే సమర్పించాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన ఎన్‌ఓసీ సహా ఇతర పత్రాలు సైతం దరఖాస్తుతో జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటులో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తారు. అందుకు అనుకూలంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. మండపాల వద్ద కేవలం బాక్సుటైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే వాడాలని సీపీ పేర్కొన్నారు.
ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు..
సిటీ పోలీసులకు అత్యంత కీలక ఘట్టంగా భావించే గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీతో పాటు మండప నిర్వాహకులతో తరచు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు చర్యల్లో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వద్దని, సున్నిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గణేష్ మండప నిర్వాహకులు పోలీసులు నిర్దేశించిన ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, పశ్చిమ, తూర్పు మండలంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నిఘా, గస్తీ పెంచాలని సీపీ అధికారులకు సూచించారు. నగర వ్యాప్తంగా తనిఖీలు, సోదాలు నిర్వహించాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించనున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఎలాంటి ఏమరుపాటు, నిర్లక్ష్యానికి తావిచ్చినా ఉపేక్షించేది లేదని సీపీ తెలిపారు.
అవసరానికి తగ్గట్టుఅదనపు బలగాలు..
మరోపక్క పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారీగా ఉన్న సిబ్బంది, అవసరమైన అదనపు ఫోర్సులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఉత్సవాలు ప్రారంభమయ్యేలోగా మరిన్ని విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌బ్రాంచ్, డిటెక్టివ్ విభాగం, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర విభాగాలకు చెందిన పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తున్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన తరవాత ఉత్సవాలు జరిగే 12 రోజులూ ఆయా ప్రాంతాల్ని బాంబు నిర్వీర్య నిపుణులు, డాగ్ స్క్వాడ్‌లు ప్రతి రోజూ రెండు సార్లు తనిఖీ చేయనున్నాయి. గణేష్ ఉత్సవాలకు చందాల పేరుతో దందాలకు దిగే వారిపై కన్నేసి ఉంచాలని, ఈ విషయంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టంచేశారు.
మొహర్రం సంతాప దినాలకు భారీ భద్రత
యాకుత్‌పురా: మొహర్రం సంతాప దినాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 10న మొహర్రం సందర్భంగా నిర్వహించే సంతాప దినాలను పురస్కరించుకొని సోమవారం ఎతేబార్‌చౌక్‌లోని రాయల్ క్లాసిక్ కాన్వెషన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మొహర్రం సంతాప దినాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఈ సందర్భంగా పురానీహవేలి, దారుషిఫా, ఎతేబార్‌చౌక్, పంజేషా, ఆలిజాకోట్లా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తల్తెకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మరాదని సూచించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ హఫందీ, కార్పొరేటర్ సోహేల్ ఖాద్రీ, నగర అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) దేవేంద్ర సింగ్ చౌహన్, జాయింట్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) తరుణ్ జోషి, సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మత పెద్దలు సయ్యద్ నజఫ్ అలీ షౌకత్, మౌలానా నిస్సార్ హుస్సేన్, సయ్యదుద్దీన్ జాఫ్రి, బీబీకా అలావా ముతవల్లీ అలీవుద్దీన్ ఆరీఫ్ పాల్గొన్నారు.