ఆదిలాబాద్ రిమ్స్ : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్రజెండానే ప్రజలకు అండ అని సీపీఎం రాష్ట్ర నాయకుడు సాయిబాబు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో సీపీఎం డివిజన్ మహాసభలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలిచింది సీపీఎం అని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటాలు మొదలుకొని ఇప్పటి వరకు పేద ప్రజల ఇళ్ల కోసం, ఉద్యోగుల, కార్మికుల, రైతుల సమస్యలపై ఉద్యమిస్తూ వస్తోందన్నారు.
అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమాన్ని మరిచి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతోందన్నారు. ఎన్నిల ప్రచారంలో పెట్టుబడిదారుల సొమ్ముతో దేశమంత తిరిగిన నరేంద్రమోడి.. ఇప్పుడు ప్రధానిగా కూడా దేశవిదేశాలు తిరుగుతున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని కుదించి పేద ప్రజల పొట్టకొటేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ విగ్రహాల పక్కన గాడ్సే విగ్రహాలు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి గత ప్రభుత్వాల దోరణినే బీజేపీ అవలంబిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లు రైతుల రుణాల ఉంటే ఇప్పటి వరకు కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి రాక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులను గుర్తించడంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని పేర్కొన్నారు.
దళితులకు భూపంపిణీ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 18 లక్ష ఎకరాలు అసరముంటే.. ఇప్పటి వరకు 15 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసిందన్నారు. ఆసరా పేరుతో అర్హులైన లబ్ధిదారులకు కూడా పింఛన్ అందకుండాపోయిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, సౌకర్యాలు కల్పించిన తర్వాతే వన్‌ఫుల్ భోజనం పెట్టాలన్నారు.
మార్చి 1న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు పెద్దఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, లంక రాఘవులు, జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, నాయకులు డి.మల్లేష్, పోశెట్లి, అశోక్, రాములు, చంద్రకళ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్రజెండానే ప్రజలకు అండ..
Published Sat, Jan 3 2015 4:45 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement