కదం తొక్కిన ఎర్రసైన్యం
సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికరువు జిల్లాగా ప్రకటించాలి: చాడ వెంకట్‌రెడ్డి
మంకమ్మతోట : కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండో గేట్ నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించిన 8 మందని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఆందోళన కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహ హాజరై మాట్లాడారు. కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలో కరువు నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించకపోగా ఇతర రాజకీయ పార్టీలన నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తోందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొత్త ప్రాజెక్టులు తెస్తూ ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులందరికి పింఛన్ పథకం వర్తింపచేయాలని, అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముల్కల మల్లేషం, సంతోషాచారి, పైడిపెల్లి శ్రీనివాస్, సెగ్గెం మధు, తిరుపతి ఉన్నారు. నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నారాయణ, ఎన్.రామయ్య, కర్రె భిక్షపతి, పొనగంటి కేదారి, కాల్వ నర్సయ్య, శోభారాణి, పి. ఐలయ్య, అందెస్వామి, గోవర్ధన్, చాడా రాజిరెడ్డి, పైడిపెల్లి రాజు, సృజన్, మల్లేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.