
‘కేటీఆర్‌కు ఆ అర్హత లేదు’
వెంకయ్య నాయుడు, మంత్రి కేటీఆర్‌లపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావులపై వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని వెంకయ్య నాయుడే నిరూపించుకోవాల్సి ఉందన్నారు. మంత్రి పదవిలో ఉండే వారు ప్రైవేటు కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడానికి వీలులేదని, కేటీఆర్ హిమాన్షు మోటార్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ‘1951-పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్’ ఈ విషయాన్ని నిర్ధేశిస్తోందని చెప్పారు.
2014 ఎన్నికల అఫిడవిట్‌లో, 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ పన్నుల శాఖకు కంపెనీ తరపున కేటీఆర్ వివరాలను సమర్పించారని అన్నారు. కేటీఆర్ బెదిరింపులతో విమర్శకుల నోళ్లు మూయించలేరన్నారు. నైతిక బాధ్యతతో కేటీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల, జిల్లెల గ్రామాల్లో దళితులపై నిర్బంధం పెరిగిందని ఆరోపించారు. స్వయంగా సిరిసిల్ల ఎస్పీ దళితులను చిత్రహింసలకు గురిచేశారని, వాస్తవాలను అంగీకరించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చౌకబారుగా థర్డ్ డిగ్రీ లేదు, ఉత్త డిగ్రీ లేదంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.