
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంఘాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాటిపై దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇవి పూర్తిగా సత్యదూరమని, ముఖ్యమంత్రి హోదాకు తగినవి కాదని ఆదివారం సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనకు 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రాష్ట్రాల్లో పర్యటించడానికి ముందే ఆర్థికసంఘం ఓ అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టుగా సీఎం పేర్కొనడం సరికాదన్నారు.
ఆర్థికపరమైన విషయాల్లో కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సవ్యంగా నిర్వహించేలా చూడటంలో ఆర్థికసంఘం పాత్ర ఉందన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రాలకు కేటాయింపులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలన్న 14వ ఆర్థికసంఘం సిఫార్సులను అమలుచేశారని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం మాత్రం స్థానికసంస్థలకు అధికారాలు, నిధుల వికేంద్రీకరణ చేయలేదన్నారు.