బాన్సువాడ : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు కోట్ల రూపాయల్లో విద్యుత్ బకాయిలు పడడంతో వాటి వసూలుకు ట్రాన్స్‌కో కార్యాచరణను రూపొందించింది. ఇటీవల ట్రాన్స్‌కో సీఎండీతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాల యాల బకాయిలపైనే చర్చించినట్లు సమాచారం. ఈ మేర కు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. మొండి బకాయిలను ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని సీఎండీ ఆదేశించడంతో జిల్లాలోని ట్రాన్స్‌కో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కు విద్యుత్తు సరఫరా నిలిపివేతే మార్గమని భావిస్తున్నారు.
ఇప్పటికే గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగ దారులు ఒక నెల బిల్లు చెల్లించకున్నా విద్యుత్తు కనెక్షన్‌ను తొలగిస్తున్న అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముక్కుపిండి మరీ బకాయిలను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్ బాన్సువాడ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్‌డబ్ల్యూఎస్)కు చెందిన ఎత్తిపోతల పథకాలు, మంచినీటి నిర్వహణ పథకాలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు కోసం పలుమార్లు ఎన్‌పీడీసీఎల్ బాన్సువాడ డివిజన్‌లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది.
ఆరు నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో కార్యాలయంలో పని చేయాల్సిన సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్నారు. వాస్తవానికి ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు నెలనెలా చెల్లిస్తున్నారు. కానీ వివిధ పథకాలకు సంబంధించి విద్యుత్తు బిల్లును చెల్లించకపోవడంతో కార్యాలయ విద్యుత్తును తొలగించారు. మొదట వివిధ పథకాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయగా, గ్రామాల్లో మంచినీటి సరఫరా లేక ప్రజలు ఆందోళనలు చేశారు.
దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరింపచేయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకే ఇబ్బంది కలిగించాలని, అప్పుడే విద్యుత్తు బకాయిలను చెల్లిస్తారని నిర్ణయించిన ట్రాన్స్‌కో డీఈ, డివిజనల్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ట్రాన్స్‌కో-ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య పలుమార్లు వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ట్రాన్స్‌కో బాన్సువాడ డివిజన్ పరిధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 20 కోట్ల బకాయి ట్రాన్స్‌కోకు ఉండడం గమనార్హం.
ఇందులో గ్రామ పంచాయతీల ద్వారా రావాల్సిన బకాయి రూ. 15కోట్లు కాగా, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల ద్వారా మరో రూ. 5 కోట్ల బకాయి రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీల నుంచి సుమారు 7 కోట్ల బకాయి, గృహ విద్యుత్తు కనెక్షన్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రావాల్సి ఉందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు రావాల్సి ఉండడంతో ఎలాగైనా వాటిని వసూలు చేయాలనే లక్ష్యంతో ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు.
బకాయి చెల్లించకుంటే కరెంట్ కట్
Published Sun, Sep 7 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement