రాంనగర్ : రబీ సీజన్ 2013-14 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని జేసీ ప్రీతిమీనా కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో ఏర్పాటు చేసినసమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి 60,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉందన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడానికి గాను ప్రతిరోజూ 2500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఖరీఫ్2014-15 సంవత్సరానికి కస్టమ్‌మిల్లింగ్ కింద ఇప్పటికే 41,767 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 40,746 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అప్పగించామన్నారు.
అయితే ఇందులో 27,707 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎవరు కూడా బియ్యాన్ని డెలివరీ చేయలేదన్నారు. ఖరీఫ్ 2014-15 సంవత్సరానికి రా రైస్ 3,08,103 టన్నులు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 15,606 టన్నులు మాత్రమే డెలివరీ చేశారన్నారు. లెవీ కింద ప్రభుత్వానికి డెలివరీ చేయాల్సిన బాయిల్డు రైస్‌కు బదులు రా రారైస్‌ను త్వరితగతిన ఇవ్వాలని కోరారు. మిల్లర్లు ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. మిల్లుల వారీగా ప్రతివారం ఎంత ధాన్యం కొనుగోలుచేశారో ప్రతి శనివారం రిపోర్టు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైస్‌మిల్లర్ల అధ్యక్షుడు, రాష్ట్ర అసోసియేషన్ కన్వీనర్ జి.నాగేందర్ మాట్లాడుతు రైస్ మిల్లర్లు బాయిల్డ్ రైస్, రా రైస్ ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, సివిల్‌సప్లయ్ డీఎం వరకుమార్, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 15 నాటికి కస్టమ్‌మిల్లింగ్ లక్ష్యం నూరుశాతం పూర్తి చేయాలి : జేసీ
Published Thu, Nov 20 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM