‘కృష్ణా’పై మరో లొల్లి! | CWC alerts Telangana government of possible floods in Krishna | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై మరో లొల్లి!

Published Mon, Mar 27 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

‘కృష్ణా’పై మరో లొల్లి!

‘కృష్ణా’పై మరో లొల్లి!

కర్నూలు జిల్లాలో శివభాష్యం సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్న ఏపీ
ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారంటున్న తెలంగాణ
ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టేనని స్పష్టీకరణ
ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ సీడబ్ల్యూసీకి లేఖ
కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసే యోచన


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాలపై ఇప్పటికే నెలకొన్న వివాదాలకు తోడు తెలంగాణ, ఏపీ మధ్య మరో చిచ్చు వచ్చి పడింది! కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా కర్నూలు జిల్లాలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న శివభాష్యం సాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను మరింత జఠిలం చేసేలా ఉంది. ఈ ప్రాజెక్టు అనుమ తులపై ఏపీ కసరత్తు మొదలు పెట్టిన వెంటనే తేరుకున్న తెలంగాణ.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు దిగింది. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది.

బచావత్‌ అవార్డులో ఎక్కడా లేని శివభాష్యం
కృష్ణా జలాలపై బచావత్‌ అవార్డు కేటాయిం పుల ప్రకారం.. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల మేర కేటాయింపులు ఉండగా, అందులో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీల మేర వినియోగించుకుంటున్నాయి. ఈ నీటి వినియోగంపైనే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. బచావత్‌ అవార్డు కేటాయించిన 811 టీఎంసీల వినియోగంలో ఎక్కడా లేకున్నా.. ఏపీ ప్రభుత్వం శివభాష్యం సాగర్‌ ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కానీ, చేపట్టే అవకాశం ఉందని కానీ బ్రజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఏపీ ఏనాడూ చెప్పలేదు.

బచావత్‌ అవార్డు ప్రకారం కర్నూలు జిల్లాకు మైనర్‌ ఇరిగేషన్‌ కింద 6.95 టీఎంసీల మేర కేటాయింపులు ఉన్నాయని, ఈ నీటిని తీసుకుంటూనే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని  ఏపీ చెబుతోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి అర్జీ పెట్టుకుంది. అయితే కర్నూలు జిల్లాకు చిన్న నీటి వనరుల కింద 6.95 టీఎంసీల కేటాయింపులున్నా.. 8.20 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటున్నారని తెలంగాణ వాదిస్తోంది. కేటాయింపులకు మించి నీటిని వాడుతోందని పేర్కొంటోంది.

 దీన్ని కాదని మళ్లీ కొత్తగా చిన్ననీటి వనరుల కింద కేటాయింపుల పేరుతో మధ్య తరహా ప్రాజెక్టును చేపడుతోంది. దీన్నే తెలంగాణ ప్రభుత్వం తప్పుపడుతోంది. కృష్ణా జలాలు వినియోగించుకుంటూ చేపట్టిన ఈ అనధికార ప్రాజెక్టుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తప్పనిసరి అని అంటోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్న అంశాన్ని గుర్తు చేస్తోంది.

దీనిపై రెండ్రోజుల కిందట సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. ‘‘ఎలాంటి అనుమతులు, కేటాయింపులు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఎలాంటి ఆర్థిక సాయానికి అనుమతి ఇవ్వరాదు. ఒకవేళ అనుమతులు మంజూరు చేస్తే ఏపీ తనకున్న వాటాలకు మించి వాడుకునేందుకు అవకాశం దొరికినట్లే. ఈ దృష్ట్యా ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీకి తగిన ఆదేశాలివ్వండి’’ అని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. తమ వాదనను కాదని సీడబ్ల్యూసీ అనుమతులు ఇస్తే.. కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement