
సాక్షి, హైదరాబాద్: ఆయనది యాక్షన్.. వారిది ఇస్మార్ట్ రియాక్షన్! ఆయనది ట్వీట్.. వారిది ‘ట్రీట్’. ఆయన పోలీసులెక్కడున్నారంటే.. వారు చలానా రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన రూటే సెపరేటు.. రీల్‌లోనూ, రియల్‌గానూ ఆయనది వివాదా’స్పదం’. టీఎస్07 2552 బుల్లెట్ బైక్‌ను ఆర్‌ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి డ్రైవ్ చేస్తుంటే లక్ష్మీస్ ఎన్‌టీఆర్ ఆగస్త్య, రాంగోపాల్ వర్మ వెనుక కూర్చొని ఉన్నారు. ఈ ఫొటోను వర్మ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. తాము మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళుతున్నామంటూ ట్వీట్ చేసిన కొంతసేపటికి... ‘పోలీసులు ఎక్కడ ఉన్నారు... వాళ్లంతా థియేటర్‌లో సినిమాలు చూస్తున్నారని అనుకుంటున్నాను’అని మరో ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
వర్మ ట్వీట్లను ఫాలో అయ్యే ఓ వ్యక్తి.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా పోలీసులకే సవాల్ విసిరేలా చేసిన వ్యాఖ్యలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్‌బుక్ ద్వారా పంపి ఫిర్యాదు చేశారు. వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘మీరు పంపిన ఫొటో ఆధారంగా ఆ బైక్ నంబర్‌కు ఈ–చలానా విధిస్తున్నాం... మాతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు’అంటూ ఇస్మార్ట్‌గా ప్రతిస్పందించారు. ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, హెల్మెట్ లేనందుకు రూ.135... మొ త్తంగా రూ.1335 జరిమానాను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించారు. అయితే, పోలీసులు జారీ చేసిన ఈ–చలానా బైక్ యజమాని బడ్డె దిలీప్‌కుమార్‌కు వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment