దళితులకు భూములు దక్కేనా..!
- భూ పంపిణీతో దళితుల్లో చిగురిస్తోన్న ఆశలు
- ప్రభుత్వ భూముల వివరాలు నమోదు పూర్తి
- మూడెకరాల భూమి ఇస్తే వందలాది కుటుంబాలకు లబ్ధి
యాచారం: ప్రభుత్వం చేపట్టబోయే భూ పంపిణీ కార్యక్రమంతో వందలాది మంది దళిత కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఆశలు చిగురిస్తున్నాయి.
మండలంలోని 20 గ్రామాల్లో 24,168 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 8,441 ఎకరాల 19 గుంటల భూమిని 1976 నుంచి ఇప్పటివరకు అసైన్‌మెంట్ కింద పేదలకు పట్టాలు ఇచ్చారు. వారం కింద అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం ఇంకా మండలంలో సాగుకు యోగ్యంగా లేని భూమి 5,406 ఎకరాల 19 గుంటలు ఉండగా, కేవలం 376 ఎకరాల 2 గుంటల భూమి మాత్రమే వ్యవసాయానికి యోగ్యంగా ఉంది. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గుట్టలు, రాళ్లు, రాప్పలతో కూడి ఉండడంతో యోగ్యంగా మార్చుకోవాలంటే పెద్దమొత్తంలో ఖర్చవుతుంది.
పలు గ్రామాల్లో వందలాది ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారు. స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ పట్టదారు పాసుపుస్తకాలను పొందిన ఆక్రమణదారులు బ్యాంకుల్లో కుదువ పెట్టి వివిధ రకాల రుణాలు పొందారు. మండలంలోని నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, కొత్తపల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి పాసు పుస్తకాలను సృష్టించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారులకు విన్నవించినా ఆ ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోయారు.