భూమి లేదట..! | dalits are concern on land distribution scheme | Sakshi
Sakshi News home page

భూమి లేదట..!

Published Tue, Dec 9 2014 2:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

dalits are concern on land distribution scheme

దళితులకు భూ పంపిణీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. 2,096 కుటుంబాలను భూమి పొందేందుకు అర్హులుగా ఎంపిక చేశారు. కేవలం 9 మందికి మాత్రమే లబ్ధిచేకూర్చిన అధికారులు అప్పుడే ‘భూమి లేదు’ అన్న పాట అందుకున్నారు. ఈ తొమ్మిది మందికి 21 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చినందుకు రూ.1.14 కోట్లు ఖర్చయిన నేపథ్యంలో మిగిలిన 2,087 మందికి భూమి కొనివ్వడం అసాధ్యమనే భావనను అధికారులు ముందుకు తీసుకొస్తున్నారు.                         

సాక్షి, ఖమ్మం: దళితులకు భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదనేందుకు కళ్యాణి మాటలే నిదర్శనం. ఆరంభ శూరత్వంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించినా ఆ తర్వాత చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లాలో తొమ్మిది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 22.14 ఎకరాలు పంపిణీ చేశారు. నాలుగు నెలలు గడిచినా మిగతా లబ్ధిదారులకు భూమి కొనుగోలు చేయలేదు. భూమిలేని దళితులకు మూడెకరాలు భూ పంపిణీ చేయాలని నూతన ప్రభుత్వం భావించింది. ఎంత ఖర్చు చేసైనా దళితులకు సాగు భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఎకరం భూమి జిల్లాలో రూ.5 లక్షలకు పైగా పలుకుతుండడంతో అధికారులు బిత్తరపోతున్నారు. 1/70 చట్టం ప్రభావంతో ఈ పథకాన్ని తొలుత ఖమ్మం రెవెన్యూ డివిజన్ వరకే వర్తింపజేశారు.

డివిజన్‌లోని 17 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున 17 గ్రామాలను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఎన్ని ఎస్పీ కుటుంబాలు ఉన్నాయో సర్వే చేశారు. 6,487 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 4,391 కుటుంబాలకు భూ మి ఉండగా 2,096 కుటుంబాలకు భూమి లేదని నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీరికి తొలి విడతలో భూ పంపిణీ చేయాలి. భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు, కూలీలు ఇలా కేటగిరీల వారిగా పేర్కొంటూ అర్హుల జాబితా సిద్ధం చేశారు.

ఈ ఏడాది ఆగస్టు 15న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జిల్లా యంత్రాం గాన్ని ఆదేశించింది. హడావిడిగా జిల్లాలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే 21 ఎకరాలు భూమి పంపిణీ చేశారు. రూ. 1.14 కోట్లు దీనికి ఖర్చు చేశారు. ఆ తర్వాత అర్హులు తమకు కూడా భూ పంపిణీ చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. వారిని జాబితాకే పరిమితం చేయడంతో భూ పంపిణీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భూమి దొరకటం లేదనే సాకుతో అధికారులు చేతులెత్తేస్తున్నారు.

ఎక్కడ చూసినా రూ.లక్షల్లో భూమి
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో 16 మండలాలు నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. సారవంతమైన ఈ భూములు రూ.లక్షల విలువ పలుకుతున్నాయి. ఏ గ్రామ దళితులకు ఆ గ్రామంలోనే భూమి కొనుగోలు చేసి ఇవ్వాలనే నిబంధన ఉండటంతో ఇక్కడ భూముల రేట్లను చూసి అధికారులు నివ్వెరపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో వైరా మండలం గొల్లెనపాడు, ముదిగొండ మండలం గంధసిరి, కూసుమంచి మండలం నేలపట్ల గ్రామాల్లో ఎకరం రూ.5 లక్షల వరకు వెచ్చించి భూమి కొనుగోలు చేసి అర్హులకు పంచారు. ఖమ్మం డివిజన్ అంతా రూ.లక్షల్లో ఎకరం భూమి రేటు ఉండడంతో అధికారులు మాత్రం భూమి దొరకడం లేదని తప్పించుకుంటున్నారు. భూమి కొనుగోలుపై అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2,096 కుటుంబాలకు ఎలా ఇస్తారు..?
ఇప్పుడే భూమి దొరక్కపోతే జిల్లాలో అర్హులైన 2,096 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకం. ఈ సంఖ్య ప్రకారం అర్హులైన వారికి తొలి దశ కింద పంపిణీ చేయాలంటే 6 వేల ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేయాలి. కానీ భూమి దొరకడం లేదని అధికారులు చేతులెత్తేయడంతో దళితుల ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

సంబంధిత అధికారులు గ్రామాల వారీగా భూముల వివరాలు, అమ్మకానికి పెట్టే రైతుల సమాచారం గ్రామస్థాయిలో తెలసుకొని వారికి నిర్ణీత రేటు చెల్లించి  భూమి అమ్మాలని ప్రోత్సహించాలి. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూమి పట్టాలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దళితులను ఈ భూమిలో సాగుకు ప్రోత్సహించలేదు. కనీసం వచ్చే ఖరీఫ్ నాటికైనా తమకు ఇచ్చిన భూమిని సాగు చేసుకునేందుకు సర్కారు సహాయం అందించాలని లబ్ధిదారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement