దామరచర్ల సమీపంలో మూసీ నదిపై ఉన్న వంతెన
దామరచర్ల(మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. నల్లగొండ– సూర్యాపేట జిల్లాల మధ్య గల మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.
దామరచర్ల మండల కేంద్రం సమీపంలో మూసీ నదిపై 2001లో రూ.2కోట్లతో నిర్మించిన వంతెన కూలే దశకు చేరింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలుపుతూ ఉన్న ఈ వంతెన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది.
దామరచర్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలైన మేళ్లచెర్వు, దక్కన్ సిమెంట్స్ కర్మాగారం,హుజూర్‌నగర్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు మట్టపల్లి, జాన్‌పహాడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు.పారిశ్రామికీకరణ ప్రాంతం కావడంతో ఈ వంతెనపై నిత్యం వందలాది వాహనాలు సిమెంట్, ఇతర లోడ్లతో వెళ్తుంటాయి.
పిల్లర్లు కూలి..చువ్వలు తేలి..
మూసీ నదిపై ఉన్న వంతెనపై పలుచోట్ల సైడ్ పిల్లర్లు కూలిపోవడంతో వాహనాలు నదిలో పడే ప్రమాదం నెలకొంది. దీంతో పాటు వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడి చువ్వలు తేలాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment