ప్రాణాలతో చెలగాటం | dangerous diseases care of adress animal body oil | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చెలగాటం

Published Tue, Feb 10 2015 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

ప్రాణాలతో చెలగాటం

ప్రాణాలతో చెలగాటం

జంతు కళేబరాలతో నూనె తయారీ
 
పాలమూరు జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న  పరిశ్రమలు
హైదరాబాద్, బెంగళూరుకు సరఫరా
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హాటళ్లు, స్వీట్‌హౌస్‌లు, బేకరీలు, దాబాలలో వాడకం
ఆ నూనె వాడితే ప్రాణాలకే ముప్పంటున్న వైద్యులు

 
సాక్షి, మహబూబ్‌నగర్: అక్రమార్కులకు పాలమూరు జిల్లా అడ్డాగా మారుతోంది. కాసులకు కక్కుర్తి పడి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఇలాంటి నూనె మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దఎత్తున ఉత్పత్తి అవుతోంది. తయారీ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల భద్రత మధ్య దందా నడుస్తోంది. వేలాది లీటర్లు అర్ధరాత్రి వేళ హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సరఫరా అవుతోంది. అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రోజురోజుకు అక్రమ వ్యాపారం వేళ్లూనుకుంటోంది.

ప్రధాన కేంద్రం పాలమూరు..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడం,  జిల్లా గుండా జాతీయరహదారి-44 దాదాపు 200 కిలోమీటర్ల మేర విస్తరించడంతో అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారుతోంది. జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా మారిన కొత్తూరుతో పాటు షాద్‌నగర్, జడ్చర్ల, భూత్పూరు, అడ్డాకుల తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి హైదరాబాద్, బెంగళూరు, రాయిచూరు తదితర ఇతర ప్రాంతాల నుంచి జంతువధశాలల నుంచి మృత కళేబరాలను రాత్రివేళ తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ పెద్ద కళాయిలు ఏర్పాటు చేసి నూనె తయారు చేస్తున్నారు. నూనె తయారీ తర్వాత వెలువడే వ్యర్థాలను ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జేసీబీల ద్వారా గుట్టల మధ్య పెద్ద గుంతలు తవ్వి అందులో పోసి మట్టితో పూడ్చేస్తున్నారు.

పెద్దఎత్తున తయారీ...

ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మృతకళేబరాల నుంచి ప్రతిరోజు వేలాది లీటర్లు తయారు చేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు తయారీ కేంద్రాల్లో పనిచేసే కూలీలుగా బీహార్, ఒడిషా ప్రాంత వాసులను నియమించుకుంటున్నారు. తయారు చేసిన నూనె నిల్వ ఉంచేందుకు ట్యాంకులు, డ్రమ్ములు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి డబ్బాలలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రివేళ హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ విధంగా తయారు చేసిన నూనెను ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హాటళ్లు, స్వీట్‌హౌస్‌లు, బేకరీలు, దాబాలలో వీటిని విరివిగా ఉపయోగించనున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ నూనెను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తదితర వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా వీటి విలువ కూడా చాలా తక్కువగా ఉండడం చేత ఫుడ్ నిర్వాహకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వంట నూనెలు కిలోకు రూ.70 నుంచి రూ.వంద వరకు పలుకుతుండ గా... జంతుకళేబరాలతో తయారు చేసిన నూనె కేవలం కిలోకు రూ.30 నుంచి 40కే దొరుకుతోంది.

కట్టుదిట్టమైన భద్రత..

జంతు కళేబరాలతో ఏర్పాటు చేసే కేంద్రాలన్నీ పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారికి దగ్గర్లోనే కేంద్రాలన్నీ ఏర్పాటు చేసినప్పటికీ అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. నూనె తయారీ కేంద్రాల వద్దకు కొత్త వ్యక్తి వెళ్తే దాడులకు పాల్పడేందుకు నిర్వాహకులు సిద్ధం చేసి ఉంచారు. అటుగా వెళ్లారంటే.. వేటాడేందుకు కుక్కలు, దాడులు చేసేందుకు కోతులకు సైతం శిక్షణ ఇచ్చారు. అయితే మృత కళేబరాలతో నూనె తయారు చేయడం వల్ల పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతోంది.

దీంతో చుట్టుపక్కల గ్రామాల వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో భూత్పూరు మండలం తాటికొండ గ్రామం వద్ద ఉన్న తయారీ కేంద్రం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తయారీ కేంద్రంపై ఎమ్మెల్యే దాడిచేసి నూనె తయారు చేస్తున్న కళాయిలను ధ్వంసం చేశారు. తాజాగా జడ్చర్ల వద్ద వల్లూరులో జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అత్యంత ప్రమాదకరం..

జంతు కళేబరాలతో తయారు చే సిన నూనె వాడకం ద్వారా అనేక దుష్పరిమాణాలు చోటు చేసుకుంటాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ నూనెలో అధిక కొలెస్ట్రాల్ ఉండడం చేత మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, గుండెపోటు, హార్మోన్‌లలో వ్యత్యాసాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. జంతుకళేబరాల నుంచి వెలికితీసే నూనెలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ త్వరతగతిన క్యాన్సర్ ఉత్ప్రేరకాలకు పురిగొల్పుతోందని సూచిస్తున్నారు. అయితే ఇంత ప్రమాదకరమైన నూనె తయారవుతున్నా జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆహార కల్తీ నిరోధకశాఖ, వైద్య ఆరోగ్య, పరిశ్రమలశాఖల అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా అక్రమార్కులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement