సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రత్యేక బస్సుల పేరిట 50 శాతం అదనపు దోపిడీకి తెరలేపింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 3,600 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు దాటి వెళ్లే బస్సులన్నింటిలోనూ సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా వసూలు చేయనున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, కర్నూలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు, నిజామాబాద్, బాన్సువాడ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, కడప, తెనాలి, ఒంగోలు, విశాఖపట్టణం, కడప, చిత్తూరు, గుడివాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు బయలుదేరే బస్సులన్నింటిలోనూ సాధారణ చార్జీలపైన అదనపు దోపిడీ ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు సాధారణ రోజుల్లో విధించే చార్జీలను ఒకటి, రెండు రెట్లు పెంచేసి నిలువుదోపిడీ సాగిస్తుండగా ఆర్టీసీ బస్సులు సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాయి.
మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి ప్రతి రోజు 3,500 నుంచి 4,000 రెగ్యులర్ బస్సులు రాకపోకలు సాగిస్తుండగా దసరా సందర్భంగా మరో 3,600 బస్సులు నడుపనున్నారు. ప్రయాణికుల రద్దీ భారీగా ఉండేందుకు అవకాశం ఉన్న 26, 27, 28, 29 తేదీలలోనే సుమారు 2,600 బస్సులు అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. అదనపు చార్జీలతో నడిపే స్పెషల్ బస్సులన్నింటికీ కాగితంపైన ముద్రించిన డెస్టినేషన్ బోర్డులు అతికించి ఉంటాయి.
నగర శివార్ల నుంచే ప్రత్యేక బస్సులు
ప్రత్యేక బస్సుల కారణంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రాంతంలో భారీ రద్దీ చోటుచేసుకొనే అవకాశం ఉన్న దృష్ట్యా రెగ్యులర్ బస్సులతో పాటు, ఈ బస్సులన్నింటినీ నగర శివార్లలోని ప్రధాన కూడళ్ల నుంచి నడిపేందుకే ఆర్టీసీ చర్యలు చేపట్టింది. సెక్టార్‌ల వారీగా బస్సుల నిర్వహణ ఉంటుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు బస్సులను శివారు ప్రాంతాల నుంచి నడుపుతారు.
♦ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ , సిద్దిపేట్, సంగారెడ్డి సెక్టార్‌ల వైపు వెళ్లే బస్సులన్నింటినీ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి నడుపుతారు.
♦ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఓల్డ్ సీబీఎస్ నుంచి నడుస్తాయి.
♦ యాదాద్రి, వరంగల్, హన్మకొండ బస్సులను ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుపుతారు.
♦ మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతాయి.
♦ వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, బెంగళూర్, తదితర అంతర్రాష్ట్ర సర్వీసులు, ఖమ్మం, మహబూబ్‌నగర్, శ్రీశైలం, కల్వకుర్తి, రాయచూర్, నాగర్‌కర్నూలు, పరిగి, తాండూరు, వికారాబాద్ బస్సులు మాత్రం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచే ప్రారంభమవుతాయి.
♦ విజయవాడ, విజయనగరం, విశాఖ పట్టణం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, పెబ్బేరు, గద్వాల, కొత్తకోట, బాన్సువాడ, బోధన్ బస్సులు కూడా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచే బయలుదేరుతాయి.
♦ ఇవి కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్‌ల నుంచి కూడా ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, చందానగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఈసీఐఎల్, కుషాయిగూడ, తదితర ప్రాంతాల నుంచి కూడా దసరా స్పెషల్ బస్సులు ఉంటాయి.
♦ ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్, ఉప్పల్, ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంటుంది.
♦ బస్సుల నిర్వహణ, ప్రయాణికుల రద్దీ నియంత్రణ, అదనపు సదుపాయాల ఏర్పాటుపైన 150 మంది ఆర్టీసీ అధికారులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు.
♦ ఆర్టీసీ ఏటీబీ కేంద్రాలు, టీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్ నుంచి ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకోవచ్చు.
3,600 ప్రత్యేక బస్సులు...
హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయలు దేరే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 3,600 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఈ అదనపు చార్జీలు రెగ్యులర్ బస్సులకు వర్తించవన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచుతామని వివరించారు.
బస్సుల సమాచారం కోసం
వివరాలకు 8330933419, 8330933532, 040–27602203, 9241448891 నంబర్లను సంప్రదించవచ్చు.