రైతు రాబందు ప్రభుత్వమిది | Dasoju sravan kumar commented over trs government | Sakshi
Sakshi News home page

రైతు రాబందు ప్రభుత్వమిది

Published Mon, May 28 2018 1:16 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Dasoju sravan kumar commented over trs government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు రాబందు ప్రభుత్వమని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. 42 లక్షల మంది రైతులకు రూ.26 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కేవలం 35 లక్షల మందికి సంబంధించిన రూ.17 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేసిందని విమర్శించారు. నాలుగు విడతల్లో అమలు చేయడంతో ఒక్కో రైతుపై రూ.12 వేల భారం పడిందని పేర్కొన్నారు. ఒక్కో రైతుకు కేవలం రూ.48 వేల ప్రయోజనం మాత్రమే కలిగిందని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించడం లేదని, కరువు రైతులకు కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్లను ఆంధ్రా కాంట్రాక్టర్లకు చెల్లించారని ఆరోపించారు. నష్ట పరిహారం కోరిన రైతులపై లాఠీచార్జి చేశారని, అలాంటి ప్రభుత్వం రైతుబంధు ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి కాదు.. గిట్టుబాటు ధర కావాలన్నారు. రైతుబంధు పేరుతో భూస్వాములకు డబ్బులిస్తున్నారని, రోగం ఒకటైతే మందొకటి వేసినట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

బ్యాంకులు ఒక్కో పంటకు ఒక్కోలా రుణమిస్తున్నాయని, సగం పెట్టుబడి అవసరాలు కూడా తీరక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘రైతు ప్రగతి సదస్సు’జరిగింది. కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం గా దాసోజు శ్రవణ్‌కుమార్‌ వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌ హయాం లో చేపట్టిన భూసంస్కరణల నుంచి, హరిత విప్లవం, ఆహార భద్రత చట్టం, బ్యాంకుల జాతీయంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలవుతున్న వ్యవసాయ విధానాలను వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.3,400 కోట్లు, మొక్కజొన్న రైతుకు రూ.28 వేల కోట్లు, వరి రైతుకు రూ.13 వేల కోట్లు, పత్తి రైతుకు 33,600 కోట్ల పంట నష్టం చెల్లించలేదని, ఇలా పంటలన్నింటికీ కలిపి మొత్తం లక్ష కోట్లకుపైగా రాష్ట్ర రైతాంగానికి నష్టం చేసిందని తన ప్రజెంటేషన్‌లో వివరించారు.

4 వేల మంది ఆత్మహత్య: ఉత్తమ్‌
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టారని, రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని వివరించారు. కానీ మార్కెట్‌ స్థిరీకరణ కోసం రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతుబంధు ప్రచారం కోసం మాత్రం రూ.100 కోట్లతో దేశంలోని అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చుకున్నారని విమర్శించారు.

రైతుకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచే ఎందుకు బోనస్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, రూ.5 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించాలంటే మద్దతు ధర కల్పించడమే మార్గమని స్వామినాథన్‌ ఎప్పుడో సూచించారన్నారు.

పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.4 వేలు రైతుకు ఏమూలకూ సరిపోవని పేర్కొన్నారు. రైతులేమైనా బిచ్చగాళ్లా.. వారికి ముష్టి వేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి సీఎం ఎందుకు వెళ్లరని కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. సదస్సులో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement