అధ్యక్ష పదవి.. అచ్చిరాలే! | DCC Charges Congress Leaders Not Happy In Rangareddy | Sakshi
Sakshi News home page

అధ్యక్ష పదవి.. అచ్చిరాలే!

Published Sun, Nov 25 2018 11:01 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

DCC Charges Congress Leaders Not Happy In Rangareddy - Sakshi

పడాల వెంకటస్వామి, కేఎం ప్రతాప్‌, క్యామ మల్లేష్‌,

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఏ నాయకుడికీ కలిసి రావడం లేదు. కొంతకాలంగా డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నాయకుల్లో ఒక్కరు కూడా ఉన్నత పదవులు ఆశించిన దాఖలాలు లేవు. కారణాలు ఏవైనా వారిని దురదృష్టం వెంటాడుతోంది. క్యామ మల్లేష్, కేఎం ప్రతాప్, పడాల వెంకటస్వామిలకు ఎదురైన అనుభవాలను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వీళ్లంతా వివిధ కాలాల్లో డీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆయా సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డారు. ఇప్పటికీ వీరిలో ఒక్కరూ కూడా ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు. ఇబ్రహీంపట్నం టికెట్‌ తనకే దక్కుతుందని ఆది నుంచి ఎన్నో పెట్టుకున్న క్యామ మల్లేష్‌కు చివరకు నిరాశే ఎదురైంది.

మహాకూటమి పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని అనూహ్యంగా టీడీపీ ఎగురేసుకుపోయింది. దీంతో మల్లేష్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టికెట్‌ కోసం తన నుంచి పార్టీ పెద్దలు రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారని పేర్కొంటూ ఆడియో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆయనపై వేటు వేసింది. డీసీసీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్‌ చేసింది. గత 2014 ఎన్నికల్లో ఈయనకు ఇబ్రహీంపట్నం టికెట్‌ కేటాయించినా ఓటమి పాలయ్యారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఓట్లు చీలిపోవడంతో మల్లేష్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇలా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయారు.
 
కేఎం ప్రతాప్‌కూ దక్కని అవకాశం 
 కేఎం ప్రతాప్‌ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. సుదీర్ఘ కాలంగా జిల్లా కాంగ్రెస్‌ బాస్‌గా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతానికి కృషిచేశారు. మూడు పర్యాయాలు మొత్తం 14 ఏళ్లపాటు డీసీసీ అధ్యక్షునిగా కొనసాగి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తనదైన ముద్ర వేసిన ఈయన కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. 2009 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌ నుంచి టికెట్‌ లభించినా గెలుపు వరించలేదు. ఇదే పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ నాయకుడు కూన శ్రీశైలంగౌడ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రతాప్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2014లోనూ ప్రతాప్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో పార్టీని వీడి కారెక్కారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో 2015 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

పడాలకూ నెరవేరని చిరకాల కాంక్ష 
డీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన లింగాల బిక్షపతిగౌడ్‌కు కూడా ఇదే అనుభవం పునరావృతమైంది. తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేకపోయారు. ఇక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పడాల వెంకటస్వామి కూడా ఇదే కోవలోకి వస్తారు. స్వల్ప కాలం డీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కావాలన్నది ఈయన చిరకాలం వాంఛ. వరుసగా మూడుసార్లు టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 1999లో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆయన.. 2009 ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌ కోసం తీవ్రంగా శ్రమించి విఫలమయ్యారు.

ఈయన బదుల కాలె యాదయ్యకు టికెట్‌ వరించింది. 2014లోనూ పడాలకు ఇదే చేదు అనుభవం ఎదురైంది. కనీసం 2018లో టికెట్‌పై గంపెడాశాలు పెట్టుకున్నా.. చివరి నిమిషంలో చేజారిపోయింది. మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి.. ఇటీవలే కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్‌ రత్నానికి టికెట్‌ని కేటాయించారు. ఈ పరిణామంతో తీవ్ర కలత చెందిన ఆయన కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. చివరకు కేఎస్‌ రత్నం.. పడాల కాళ్లు మొక్కడంతో శాంతించారు. ఇలా మూడుసార్లు టికెట్‌ ఆశించినా తన చిరకాల కోరిక నెరవేరలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement