జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో డిపాజిట్లను సేకరించింది.
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో డిపాజిట్లను సేకరించింది. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు రూ. 225.93 కోట్లను సేకరించడం విశేషం. గత ఏడాది రూ. 173.65 కోట్ల డిపాజిట్‌లను సేకరించగా ప్రస్తుత సంవత్సరంలో సుమారు రూ.53 కోట్లను అదనంగా సేకరించారు. ఈ బ్యాంకు.. డిపాజిట్ దారులకు 9.20 శాతం వడ్డీని చెల్లిస్తుండగా సీనియర్ సిటిజన్‌లకు దీనికి అదనంగా మరో 0.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.
దీంతో డీసీసీబీలో పెద్ద ఎత్తున డిపాజిట్ చేయడానికి ఖాతాదారులు ముందుకు వస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. వాణిజ్య బ్యాంకులకన్నా 0.5 శాతం అధిక వడ్డీని డిపాజిట్‌దారులకు చెల్లిస్తున్నారు. సేవింగ్ , కరెంట్, టర్మ్ ఖాతాదాలరులతో పాటు సొసైటీలు కూడా పెత్త ఎత్తున బ్యాంకులో డిపాజిట్‌లు పెడుతున్నాయి. వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ ఖాతాదారులకు సేవలను అందిస్తుడడంతో పాటు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, డీబీటీ(డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విధానం అమలులో ఉన్నందున ఖాతాదారులు బ్యాంకులో డిపాజిట్‌లను పెడుతున్నారు. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో రూ.300 కోట్ల డిపాజిట్‌లను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సమష్టి కృషితో సాధించాం
డీసీసీబీలో డిపాజిట్‌లను పెద్ద ఎత్తున పెంచడంలో అన్ని బ్రాంచ్‌ల మేనేజర్‌లు, సిబ్బంది సమష్టి కృషి ఉంది. బ్రాంచ్‌ల వారీగా ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయడానికి కృషి చేశారని డీసీసీబీ సీఈఓ నర్మద తెలిపారు. బ్యాంకుపై ఖాతాదారులకు ఉన్న నమ్మకం, తాము అందిస్తున్న సేవల కారణంగానే పెద్ద ఎత్తున బ్యాంకులో డిపాజిట్‌లు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. వచ్చే ఏడాది లక్ష్యానికి మించి సేకరించడానికి కృషి చేస్తామన్నారు.
నాలుగేళ్లుగా సేకరించిన డిపాజిట్‌ల వివరాలు ఇలా..
సంవత్సరం= సేకరించిన డిపాజిట్ రూ.లలో
2012= రూ.157.73 కోట్లు
2013= రూ.167.52 కోట్లు
2014= రూ.173.65 కోట్లు
2015 ఇప్పటి వరకు= రూ.225.93 కోట్లు.