సాక్షి, సంగారెడ్డి: పుర పోరులో నామినేషన్ల ఘట్టం ముగిసింది. శుక్రవారం చివరి రోజు నామినేషన్ల సందడి నెలకొంది. ఎన్నికలు జరగనున్న అన్ని మునిసిపాలి టీలు, నగర పంచాయతీల్లో కుప్పలు తెప్పలుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 10న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా గురువారం నాటికి 734 నామినేషన్లు వచ్చాయి. అయితే, శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 1,061 నామినేషన్లు దాఖలయ్యా యి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 1,795కు పెరిగింది.
ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు. తిరస్కరణ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి కొందరు అభ్యర్థులు రెండు మూడు సెట్ల పత్రాలను దాఖలు చేశారు. దీంతో నామినేషన్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. అత్యధికంగా సంగారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో 31 వార్డుల ఉంటే.. చివరి రోజు 271 నామినేషన్లు రావడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 460కు ఎగబాకింది. భారీ సంఖ్యలో అభ్యర్థులు, మద్దతుదారులు తరలిరావడంతో మునిసిపల్, నగర పంచాయతీ కార్యాలయాల పరిసరాల్లో సందడి నెలకొంది.
నేడు పరిశీలన
నామినేషన్ల పత్రాలను శనివారం అధికారులు పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే స్వీకరించనున్నారు. లేనిచో తిరస్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 18తో గడువు ఉంది. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల
తుది జాబితాను అదే రోజు ప్రకటించనున్నారు. 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపి..వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
బుజ్జగింపులు షురూ
నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇప్పుడు బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థులపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. వారిని పోటీ నుంచి తప్పించడానికి అప్పుడే బుజ్జగింపులు ప్రారంభించాయి.
నయానో భయానో రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. బరిలో నుంచి తప్పుకుంటే తాయిలాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు రెబల్స్ సైతం ససేమిరా అంటున్నారు. ఈ నెల 18న ఉపసంహరణ గడువు ముగిసిపోయాక.. బరిలో ఉండే అసలు అభ్యర్థులెవరో తేలనున్నారు. అప్పటిలోగా ఈ సస్పెన్స్ కొనసాగనుంది.
పురపోరుకు నామినేషన్లు
Published Fri, Mar 14 2014 11:25 PM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement