
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంశంపై మంగళవారం శాసనసభ అట్టుడికింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి ఈటల పేర్కొనగా.. ఆ లెక్కలన్నీ అవాస్తవమంటూ విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతోనే తెలంగాణ పోరాటం జరిగిందని.. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్‌ను అయినా సరిగా పూర్తి చేయలేదని.. తప్పులు చేయడం, కప్పిపుచ్చుకోవడంతోనే సరిపోతోందని విమర్శించారు. ఈ విమర్శలపై ఈటల ఘాటుగా స్పందించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నది విపక్ష నేతలేనని వ్యాఖ్యానించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎంల సభ్యులు వాకౌట్ చేశారు. మంగళవారం శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ భర్తీ లెక్కలతో వచ్చిన విపక్ష సభ్యులు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
అడ్డుకుని.. ఆరోపణలు చేస్తున్నారు..: ఈటల
ఉద్యోగాల అంశంపై మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఏ వ్యక్తులైతే కోర్టుల్లో కేసులు వేసి నీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారో.. అదే తరహాలోనే ఉద్యోగ నియామకాలను అడ్డుకోవటం కోసం కేసులు వేస్తున్నారని ఆరోపించారు. నియామక ప్రక్రియలను ఆపటం కోసం టీఎస్‌పీఎస్సీ మీద 272 కేసులు వేశారని, అయినా తాము 73 నోటిఫికేషన్లు విడుదల చేశామని వివరించారు. రాష్ట్రంలో మొత్తంగా 4,41,995 ఉద్యోగాలు ఉంటే.. 1,08,132 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. 63,152 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని, మిగతా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడవద్దని, ఏ రాష్ట్రంలోనైనా ఒకటిన్నర రెండు శాతం కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలుండవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,744 ఉద్యోగాలను భర్తీ చేశామని.. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7,266, విద్యుత్ శాఖలో 1,427, పోలీసు శాఖలో 12,157 పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ 31 సార్లు సమావేశమైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పూర్తి స్థాయిలో ఉద్యోగుల విభజన జరగలేదని.. ఇంకా 1,400 మంది ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందని ఈటల తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
ఐటీ రంగంలో రాష్ట్రమే నంబర్ వన్
దేశంలోనే ఐటీ రంగంలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని.. 2014–17 మధ్య ఐటీ ఎగుమతులు రూ.30 వేల కోట్ల మేర పెరిగాయని ఈటల చెప్పారు. ఆపిల్ కంపెనీ బెంగళూరుకు తరలిపోయిందనడంలో వాస్తవం లేదని, ఇక్కడే ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక సంస్థలు మూతపడి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని.. అదే తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు వెన్నుపోటు: కె.లక్ష్మణ్
నియామకాల కోసం జరిగిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. కానీ ఇప్పుడు యువకులకు అదే దక్కడం లేదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను వెన్నుపోటు పొడుస్తోందన్నారు. భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ యువత, విద్యార్థులు ఆశించారని.. కానీ నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీని చూస్తే ‘ఓ స్త్రీ రేపురా’అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5,23,675 ప్రభుత్వోద్యోగాలు ఉన్నాయని.. అందులో సీమాంధ్ర ప్రాంతం వారు 83 వేల మంది ఉన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. యువత, విద్యార్థులు అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం.. ఇప్పుడు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.17 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని.. కానీ మూడేళ్లలో 17 వేల పోస్టులే భర్తీ చేశారని, ఇందులోనూ 11 వేల పోస్టులు పోలీసు శాఖలోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఒక్క నోటిఫికేషన్ అయినా సరిగా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ప్రశ్నపత్రం, మూల్యాంకనం, వైట్‌నర్ సమస్యలు, చివరికి ఫలితాల్లో తప్పులు... ఇలా ఏదో ఒక తప్పిదంతో అభాసుపాలవుతోందని విమర్శించారు. ఐటీకి హైదరాబాద్ చిరునామా అంటారని.. మరి టీఎస్‌పీఎస్సీకి సాంకేతిక వ్యవస్థ ఉండదా? అని నిలదీశారు. విశ్వవిద్యాలయాలు కేంద్రంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని.. ఇప్పుడా విశ్వవిద్యాలయాల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నారన్నారు.
పోస్టులు ఎందుకు తగ్గాయి?: టి.రామ్మోహన్‌రెడ్డి
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు ఉద్యోగ నియామకాల విషయాన్నే మర్చిపోయిందని కాంగ్రెస్ సభ్యుడు టి.రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో 27 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం... తీరా నోటిఫికేషన్‌కు వచ్చే సరికి 8,792 పోస్టులు భర్తీ చేయడమేమిటని నిలదీశారు. నియామకాలు త్వరగా చేపట్టాలని కోరారు
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలం: అక్బరుద్దీన్
తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని యువత ఆశగా ఎదురు చూసిందని.. ఆ ఆశలు అడియాసలు అయ్యాయని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, మండలాలు, సర్కిళ్లు ఎన్ని ఏర్పడినా కొత్త పోస్టులు మాత్రం రావడం లేదన్నారు.
గ్రూప్–1, 3, 4 నోటిఫికేషన్లేవీ..?: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలో గ్రూప్–1, 3, 4 నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటానికి ఒక ప్రత్యేక చట్టం తేవాలన్నారు. ప్రభుత్వంలోకి యువరక్తం రావాలని.. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో 50 శాతం డైరెక్టు నియామకాల ద్వారా, 50 శాతం పదోన్నతుల ద్వారా నింపాలని సూచించారు. 1998 డీఎస్సీ బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.
బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయరా: సున్నం రాజయ్య
రాష్ట్రంలో 23 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. బేస్ క్యాంపుల్లో పనిచేస్తున్న 2,500 మంది గిరిజన యువకుల జీతభత్యాలు పెంచలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఒక్క పాఠశాలనూ మూసివేయలేదు: కడియం
రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేయలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వాస్తవాలు ఒకలా ఉంటే బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మరోలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఎక్కడైనా మూసివేసినట్లు తెలిస్తే వివరాలు చెప్పాలని... అంతేతప్ప తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించవద్దని వ్యాఖ్యానించారు.
‘నెహ్రూ జయంతి’పై వాగ్వాదం
ఉద్యోగాల కల్పనపై స్వల్పకాలిక చర్చ చేపడుతున్నట్లు స్పీకర్ ప్రకటించిన సమయంలో.. కాంగ్రెస్ సభ్యులు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి అంశాన్ని లేవనెత్తారు. దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా ప్రభుత్వపరంగా కనీసం ఒక్క ప్రకటన అయినా ఇవ్వలేదని, ఆయన సేవలపై చర్చించాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి కోరారు. అయితే నెహ్రూ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతోందని, మంత్రి తుమ్మల ఆ కార్యక్రమంలోనే ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. ఇక సంప్రదాయం లేని, ముందుగా నిర్ణయించని అంశాలపై చర్చించాలని కోరడం సరికాదని సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమైన ఉద్యోగాల కల్పన అంశంపై మాట్లాడుతుంటే చర్చ జరగకుండా వ్యవహరించడం కాంగ్రెస్‌కు తగదని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment