శస్త్ర చికిత్స వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ‘స్వాప్’పద్ధతిలో ఒకే సమయంలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం దాతలు, స్వీకర్తలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు డెక్కన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాయక్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ పవన్‌కుమార్, కిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌లు వెల్లడించారు.
సింగరేణి కాలరీస్ ఉద్యోగి బిల్ల మల్లయ్య జన్యు సంబంధ మూత్ర పిండాల సమస్యతో బాధపడు తున్నాడు. చికిత్స కోసం ఆయన ఇటీవల డెక్కన్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిందని, మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కార మని సూచించారు. కిడ్నీ దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నా కిడ్నీ లభించలేదు. దీంతో మల్లయ్య(బ్లడ్ గ్రూప్–బి)కు కిడ్నీ ఇవ్వడానికి భార్య పద్మ(బ్లడ్ గ్రూప్–ఎ) అంగీకరించింది. అయితే, స్వీకర్త, దాతల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం చికిత్సకు అడ్డంకిగా మారింది.
ఇదే సమయంలో కిమ్స్‌లో కరీంనగర్‌కు చెందిన బానోతు రాజు(బ్లడ్ గ్రూప్–ఎ)ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన భార్య సునీత బ్లడ్‌గ్రూప్–బిగా తేలింది. ‘స్వాప్’ (రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ఇద్దరు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవమార్పిడి చికిత్స)పద్ధతిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు భావించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనికి సుమారు ఆరునెలలు పట్టింది. సునీత నుంచి సేకరించిన కిడ్నీని డెక్కన్ ఆస్పత్రిలోని మల్లయ్యకు అమర్చగా, పద్మ నుంచి సేకరించిన కిడ్నీని బానోతు రాజుకు కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా అమర్చారు. రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను స్వైప్‌లో వీక్షిస్తూ చేశారు. ఈ తరహా చికిత్స దక్షిణాదిలో ఇదే మొదటిదని డాక్టర్ నాయక్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment