సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్‌కు ఓటమి భయం పట్టుకుందా? ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం బరిలో దిగితే పరాజయం పాలవుతానని ఆందోళన చెందుతున్నారా? ఎంపీ స్థానం కంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానం సురక్షితమని భావిస్తున్నారా? ఆయ న వేసిన నామినేషన్లను పరిశీలిస్తే అవుననే విషయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది. తొలిరోజే రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ ఎంపీ స్థానంతోపాటు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేశారు. ఖాళీ అయిన జిల్లా టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు ముఖ్యనేతల్లో రాథోడ్ రమేష్ ఒకరు. రెండు కళ్ల సిద్ధాం తం, అప్పుడే రాష్ట్ర విభజనకు తొందరెందుకంటూ తెలంగాణ అడ్డుకునేందుకు కేంద్రంలో పావులు కదిపిన చంద్రబాబుకు రాథోడ్మ్రేష్ ఆది నుంచి అండగా నిలుస్తున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్‌తోపాటు, ముఖ్యనేతలంతా టీడీపీని వీడినా, రాథోడ్ రమేశ్ మా త్రం చంద్రబాబునే అంటి పెట్టుకున్నారు. దీంతో తెలంగాణవాదుల్లో రాథోడ్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ అంశమే అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుండటంతో రాథోడ్ అం తర్మథనంలో పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అందుకే ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నా, సీట్ల పంపకాల విషయంలో స్పష్టత రాలేదు. జిల్లాలో ఏ సీటు బీజేపీకి వెళుతుందో, టీడీపీకి ఏఏ స్థానాలు దక్కుతాయో తేలక ముందే ఆయన ఆఘమేఘాలపై ఆసిఫాబాద్‌కు నామినేషన్ వేయడం ఈ రెండు పార్టీల శ్రేణుల్లో కలకలం రేగింది.
బీజేపీతో పొత్తుపైనే ఆశలు
వరుస వలసలు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత, చంద్రబాబు వైఖరి కారణంగా తీవ్ర సంక్షోభంలో పడిన టీడీపీ జిల్లాలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర పరాజయం పాలవుతామనే నిర్ణయానికి వచ్చిన ‘దేశం’ నేతలు బీజేపీతో పొత్తుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని రాథోడ్ రమేష్ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కానీ జిల్లాలోని బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తుకు ససేమిరా అం టున్నాయి. ఇందులో భాగంగా టీడీపీకి ధీటుగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.
ఎంపీగా ప్రత్యామ్నాయ అభ్యర్థి
ఎంపీగా పోటీ చేసేందుకు రాథోడ్ పునరాలోచనలో పడటంతో టీడీపీ ప్రత్యామ్నాయ అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన సోయం బాపురావును ఎంపీగా బరిలో దించాలని భావిస్తోంది. సోయం బాపురావు మాత్రం బోథ్ ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
పొత్తులో భాగంగా ఈ ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మాత్రం బోథ్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఎంపీగానే బరిలోకి దిగుతానని సోయం బాపురావు తన సన్నిహితుల వద్ద పేర్కొంటున్నారు.
రాథోడ్‌కు ఓటమి భయం
Published Sun, Apr 6 2014 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement