పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం
హాలియా (నల్లగొండ): పార్టీ ఫిరాయింపు అప్రజాస్వామికమని, అనైతికమని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీలోకి వెళ్లడం సరైనది కాదన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో జరిగినా, ఎవరు ప్రోత్సహించినా అది సరైన విధానం కాద్దన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికి ప్రజలే వెంటబడి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం నుంచి మూడు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు స్థానిక ప్రజలు, నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోనికి వెళ్లిన వారు మళ్లీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ మారాలనుకుంటే పార్టీకి, పదవికిరాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ ఇతర పార్టీలోనికి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుపోందాలని సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద వరి, ఇతర పంటలను కాపాడాల్సిన బాధ్యత రె ండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కాకునూరి నారాయణ, రావుల శ్రీనివాస్ యాదవ్. యడవెల్లి సోమశేఖర్, మర్ల చంద్రారెడ్డి, పోశం శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.