
హాలియా వ్యూ
సాక్షి, త్రిపురారం : మారుతున్న సమాజంలో ఉన్నత చదువులు ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటర్ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థుల చదువులు ప్రస్తుతం ప్రశ్నార్థంకంగా మారాయి. నియోజకవర్గ కేంద్ర బిందువైన హాలియా పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రతి ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇవ్వడం ఆ తరువాత మరిచిపోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సమీపంలో హాలియా పట్టణం ఉండగా, ఈ పట్టణం వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ విద్యా రంగంలో మాత్రం వెనకబడిపోయింది.
గతంలో సాగర్ నియోజకవర్గం నుంచి కుందూరు జానారెడ్డి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచారు. అనేక మంత్రుత్వశాఖలు చేపట్టి ఈ ప్రాంతాన్ని పలు రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. గత మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన నోముల నర్సింహయ్య డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇచ్చిన హామీ మేరకు 2019–20 విద్యా సంవత్సరంలోనైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
చదువును మధ్యలోనే ఆపేస్తున్న విద్యార్థులు..
సాగర్ నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల నుంచి ప్రతి ఏటా ఇంటర్ ఉత్తీర్ణులైయ్యే విద్యార్థుల సంఖ్య సుమారు 800 మందికిపైగానే ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కళా శా ల లేకపోవడంతో ఇంటర్ పాసైన విద్యార్థులు ఉ న్నత విద్య కోసం మిర్యాలగూడ, నల్లగొండ వం టి పట్టణాలకు వెళ్లాల్సివస్తోంది. అయితే ఆ యా పట్టణాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిం చాలంటే ఆర్థికస్థోమత సరిగా లేని పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీ ఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాదైనా నియోజకవర్గం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుందని గంపెడు ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.