
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల విషయంగా ఏం చేయాలని విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఆయా పాఠశాలల్లోని టీచర్లు, విద్యార్థులను హేతుబద్ధీకరించాలని.. సమీపంలోని స్కూళ్లకు తరలించడం ద్వారా మెరుగైన విద్య అందించడం సాధ్యమవుతుందని యోచిస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండేలా చర్యలు చేపట్టవచ్చని భావిస్తోంది. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రాకుండా.. నిర్వహణ సాధ్యంకాని పాఠశాలలను ఎలా కొనసాగించాలో చెప్పాల్సిందిగా కోరాలని నిర్ణయించింది.
మొత్తంగా ఉపాధ్యాయ సంఘాలను కూడా ఒప్పించి హేతుబద్ధీకరణపై ముందుకెళ్లడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతే పిల్లలు తక్కువగా ఉన్న హైస్కూళ్లలోని విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించడం లేదా సైకిళ్లను అందించాలని.. విద్యార్థులు డ్రాపౌట్స్‌గా మారకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి.. తదుపరి చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వృథా అవుతున్న మానవ వనరులు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లలో 403 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 10 మంది లోపే విద్యార్థులున్న పాఠశాలల్లో 1,769 మంది టీచర్లు పనిచేస్తున్నారు. దీంతో మానవ వనరులు వృథా అవుతున్నాయి. ఇక 11 నుంచి 20 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో 3,944 మంది టీచర్లు పని చేస్తున్నారు. ఇలా మొత్తంగా 20 మందిలోపే విద్యార్థులున్న స్కూళ్లలో 6,116 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లను, విద్యార్థులను సమీప స్కూళ్లకు తరలించి.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని విద్యాశాఖ యోచిస్తోంది.
మోడల్ హైస్కూళ్లుగా..
ప్రతి మండలంలో తక్కువ మంది విద్యార్థులున్న హైస్కూళ్లలోని విద్యార్థులు, టీచర్లను సమీపంలోని హైస్కూళ్లకు తరలించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఇలా ప్రతి మండలంలో రెండు మూడు హైస్కూళ్లలోని విద్యార్థులు, టీచర్లను ఒక చోటికి చేర్చి ఎక్కువ మంది విద్యార్థులు, టీచర్లతో మోడల్ స్కూళ్లుగా మార్చాలని.. మెరుగైన విద్యాబోధన అందేలా చూడాలని భావిస్తోంది.
ఈసారైనా అమల్లోకి..
విద్యా శాఖ హేతుబద్ధీకరణపై మూడేళ్లుగా అనేక రకాల ఆలోచనలు చేసింది. కానీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో ముందడుగు వేయడం లేదు. అయితే ఈసారి హేతుబద్ధీకరణ విషయంలో పక్కాగా వ్యవహరించడమే మంచిదన్న ఆలోచన చేస్తోంది. విద్యార్థులు తక్కువగా ఉండి సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యార్థులు నష్టపోతారని.. అవసరానికంటే ఎక్కువ మంది టీచర్లున్న చోట మానవ వనరులు వృథా అవుతాయని భావిస్తోంది.
వందల సంఖ్యలో పాఠశాలల్లో..
- రాష్ట్రంలో 25,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 460 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 452.
- ఒకటి నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,285 కాగా.. 11–20 మందిలోపు స్కూళ్లు 2,892, 21 నుంచి 30 మందిలోపు స్కూళ్లు 3,742 ఉన్నాయి.
- మొత్తంగా ఒకటి నుంచి 20 మందిలోపు విద్యార్థులున్నవి 4,637 కాగా.. ఇందులో 4,096 ప్రాథమిక పాఠశాలలే. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 189 స్కూళ్లు ఉన్నాయి.
- రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థీ లేని హైస్కూళ్లు 2 కాగా... 20 మందిలోపు ఉన్నవి 5.. 21 నుంచి 30 మందిలోపు ఉన్నవి 21.. 31 నుంచి 40 మందిలోపు ఉన్నవి 49.. 41 నుంచి 50 మందిలోపు ఉన్నవి 63 పాఠశాలలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment