హైదరాబాద్: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడి సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదినెలల్లో పేదల సంక్షేమం గురించి ఆలోచించారన్నారు. వృద్ధులు, వితంతుల కోసం నెలనెలా వెయ్యి రూపాయల పింఛన్ల పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. అలాగే వికలాంగులకు రూ. 1500 ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. పేద ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 51వేలు ఇస్తున్న ప్రభుత్వం ఇదొక్కటేనని అన్నారు.
రాజస్థాన్‌లో అక్కడి ముఖ్యమంత్రి షాదీ ముబారక్ గురించి వాకబు చేయడాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటుబ్యాంకు గానే ఉపయోగించుకుందని విమర్శించారు. పేదలకు ఇచ్చే ఒకరూపాయికి కిలో బియ్యం పథకాన్ని కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఓ ఎస్‌సీ, ముస్లిం మైనారిటీ వ్యక్తులను ఉప ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. సెక్యులరిజానికి కట్టుబడ్డ సీఎం అని కొనియాడారు. టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె. కేశవరావు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణ కోల్పోయినదేంటో, సాధించుకున్నదేంటో కేసీఆర్ తన పాలన ద్వారా చూపిస్తున్నారన్నారు. సమైక్య పాలనలో సాగర్ కింద రెండో పంటకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని , ఈసారి 3.5 లక్షల ఎకరాలకు రబీలో నీరందిస్తున్నట్లు చెప్పారు.
మన హక్కును మనం సాధించుకోవడానికే కేసీఆర్ 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని కితాబిచ్చారు. 64 ఏళ్ల సమైక్య పాలనలో వేసవి కాలంలో కరెంటు కట్‌లేని పరిస్థితి ఏనాడూ లేదని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. రూ. 91,500 కోట్లతో 24వేల మెగావాట్ల విద్యుత్తును నాలుగేళ్లలో ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు కేకే వివరించారు. పోరాడి తెలంగాణను సాధించుకోవడంతోనే సరిపోదు.. సాధించుకున్న తెలంగాణను పునర్మించుకోవాలన్న పట్టుదల కేసీఆర్‌లో ఉందన్నారు.
వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను నీళ్లతో నింపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చరిత్ర సృష్టించిందన్నారు. 14 ఏళ్ల పోరాటంలో వ్యూహాత్మకంగా కేసీఆర్ తెలంగాణను సాధించారని కొనియాడారు. కాంతులీనే బంగారు తెలంగాణను పునర్నిర్మించుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ సంక్షేమ సారథి’ ఆడియో సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.
'అన్ని వర్గాల సంక్షేమం కోసం తపిస్తున్న కేసీఆర్'
Published Tue, Apr 28 2015 12:30 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement