ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో రిజి స్ట్రేషన్ల, స్టాంపుల శాఖ మరోసారి చతికిలపడింది.
► గతం కన్నా ఆదాయం పెరిగినా..
► లక్ష్యానికి రూ.1,100 కోట్ల దూరం
► ఇన్‌చార్జీల పాలనలో కొరవడిన పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో రిజిస్ట్రేషన్ల, స్టాంపుల శాఖ మరోసారి చతికిలపడింది. 2015- 16 ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా గత మార్చి ఆఖరుకు కేవలం రూ.3,401.81 కోట్లతోనే సరిపెట్టుకోవా ల్సి వచ్చింది. 2014-15లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.2,746.21 కోట్లు ఉండగా, 2015-16లో 23.87శాతం ఆదా యం పెరగడం ఊరటగా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రమంతటా కలిపి రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయంలో గరిష్టంగా 49.18శాతం(దాదాపు సగం) రంగారెడ్డి జిల్లా నుంచి 19.20 శాతం హైదరాబాద్ జిల్లా నుంచే కావడం విశేషం. ఈ రెండు జిల్లాల్లో వచ్చే ఆదాయం దాదాపు 70 శాతం కాగా, మిగిలిన 8 జిల్లాల్లో 30 శాతం ఆదాయమే లభిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
రెండేళ్లుగా ఇన్‌చార్జీల పాలనే!
రిజిస్ట్రేషన్ల శాఖలో గత రెండేళ్లుగా ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతోంది. ఇన్‌స్పెక్టర్ జనరల్‌తోపాటు ముఖ్య కార్యదర్శి, 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతున్నారు. దీంతో ఏటా లక్ష్యం మేరకు ఆదాయం పెంపు, వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై ఇన్‌చార్జీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అరకొరగా కొత్త కార్యక్రమాలు చేపట్టినా సరైన యంత్రాంగం లేక కిందిస్థాయిలో వినియోగదారుల దాకా అవి చేరడం లేదు. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను నింపకపోవడంతో ఒక్కో అధికారికి నాలుగేసి జిల్లాల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. వివిధ స్థాయిల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.
దీంతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడం, అర్హులైనవారికి పదోన్నతులు కల్పించకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మేరకు నిస్తేజం నెలకొంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, సబ్ రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేస్తారని ఆశించినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రైవేటు వ్యక్తులే అన్ని రకాల పనులు చక్కపెడుతున్న పరిస్థితి ఉంది.