అసమ్మతి సెగలు | Differences Among TRS Leaders In Nizamabad | Sakshi
Sakshi News home page

అసమ్మతి సెగలు

Published Sun, Sep 9 2018 11:04 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Differences Among TRS Leaders In Nizamabad - Sakshi

టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే ప్రకటించడంతో ఆ పార్టీలో నిరాదరణకు గురైన నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ తమను పక్కన పెట్టారని, ఇప్పుడు కలిసి రమ్మంటే ఎలా వెళ్తామని అంటున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వద్దనే తేల్చుకుంటామని చెబుతున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనతోనే ఉమ్మడి జిల్లాలో అసంతృప్తి సెగలు లేస్తున్నాయి. ఆ పార్టీ లో చిచ్చు క్రమంగా రాజుకుంటోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను కావాలని దూరం పెట్టారని, ఎన్నికల సమయంలో ఇప్పుడు తాము గుర్తొచ్చామా అని అస మ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల వద్దే మాట్లాడుకుందామని తేల్చి చెబుతున్నారు.

ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టిం గ్‌ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఏనుగుకు మరోమారు టికెట్‌ ఖరారు చేయడంపై ఈ నియోజకవర్గంలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్‌గౌడ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విషయం తెలుసుకున్న రవీందర్‌రెడ్డి గురువారం నాగిరెడ్డిపేట్‌ మండలం ధర్మారెడ్డిలోని జనార్దన్‌గౌడ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లూ తనను అణగదొక్కే ప్రయత్నం చేసి, ఇప్పుడు కలిసి పనిచేద్దామంటే ఎలా అని జనార్దన్‌గౌడ్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో సన్నిహితుడిగాVBఉన్నందుకే తాను అలా చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బి జనార్దన్‌గౌడ్‌ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో సముచిత స్థానం (ఎమ్మెల్సీ) ఇస్తామని అధినేత ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఏదైనా ఉంటే మంత్రి కేటీఆర్‌ వద్ద చర్చించుకుందామని, ఇ ప్పు డు మాట్లాడే పరిస్థితి లేదని జనార్దన్‌గౌడ్‌ తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రవీందర్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడంతో గాంధారి మండల రైతుసమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

బాల్కొండలోనూ..
బాల్కొండ నియోజకవర్గ స్థానం వేముల ప్రశాంత్‌రెడ్డికి కేటాయించడంపై ఆ పార్టీ మరోనేత ముత్యాల సునీల్‌రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఇక్క డ ఈ ఇద్దరు నేతలు మొదటి నుంచి ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. నియో జకవర్గంలో సునీల్‌రెడ్డికి తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ ఉంది.ఈసారి కూడా వేములకు టికెట్‌ కేటాయించడంతో సునీల్‌రెడ్డి తన అనుచరులతో ఆదివారం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు వేల్పూర్‌ మండలం లక్కొరలో ఓ ఫంక్షన్‌హాలులో అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నట్లు తెలిసింది.

రూరల్‌పైనా.. 
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు అంతర్గతంగా రగులుతున్నా యి. మరోమారు బాజిరెడ్డికి అవకాశం ఇవ్వడం తో ఆయన వ్యతిరేకవర్గం రగిలిపోతున్నారు. ఇక్కడ బాజిరెడ్డి వర్గీయులకు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వర్గీయులకు ఆది నుంచి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తారాస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించుకోవడం పరిపాటిగా మారింది. ఒకానొక స్థాయిలో బాహాబాహీకి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాజిరెడ్డికి తిరిగి అభ్యర్థిత్వం ఖరారు కాగా, ఆయన వ్యతిరేకవర్గం అంతర్గతంగా రగిలిపోతోంది. ఈ విషయమై ఎంపీ కవితను కలిసి తమ అసంతృ ప్తిని వెళ్లగక్కాలని భావిస్తున్నారు.

బోధన్‌లో మౌనంగా ప్రముఖ నేతలు..
బోధన్‌ స్థానం షకీల్‌కు కేటాయించడంపై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కొందరు మౌనం వహిస్తున్నారు. అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకపోయినప్పటికీ, అంతర్గతంగా తమ అసంతృప్తిని ఎంపీ వద్ద విన్నవించాలనే యోచనతో ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మేడపాటి ప్రకాశ్‌రెడ్డి ఏడాది క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే ఇటీవల రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గిర్దావర్‌ గంగారెడ్డి, మైనార్టీ నేత రజాక్‌ వంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వం ఖరారయ్యాక తొలిసారిగా శనివారం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా షకీల్‌ అమేర్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఈ నాయకులు గైర్హాజరవడం పార్టీలో చర్చకు దారితీసింది. ఈ అసమ్మతి.. అసంతృప్తులన్నీ పెద్ద సమస్యే కాదని, ఒక్కసారి పిలిచి మాట్లాడితే అన్నీ సమసిపోయి, కలిసికట్టుగా ప్రతిపక్షాలనును ఎదుర్కొనడం ఖాయమంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement