'అతిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. జాగ్రత్త'
ఇబ్రహీంపట్నం: తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో కార్యకర్తల ఆందోళనతో గందరగోళం రేగింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. పొన్నాలను తప్పించాల్సిందేనని పట్టుబట్టారు. సోనియా తెలంగాణ ఇస్తే వేదికపై ఉన్న నేతలే గెలిపించలేకపోయారని దుయ్యబట్టారు.
పార్టీలో ఉన్న లోపాలు, వైఫల్యాలను తమను చెప్పనీయాలంటూ నినదించారు. తమను గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఖమ్మం, నల్లగొండ జిల్లా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సభకు అంతరాయం కలిగించొద్దని, మీ అభిప్రాయాలు వింటానని వారితో దిగ్విజయ్ సింగ్ అన్నారు. అతిగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం జాగ్రత్త అంటూ ఆందోళన చేస్తున్న నేతలను హెచ్చరించారు.