
డిస్కంలు ప్రైవేటు చేతుల్లోకి!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రైవేటు పరం చేసే దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రైవేటు పరం చేసే దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించుకుంది. ముందుగా విద్యుత్ సరఫరా, పంపిణీ(టీ అండ్ డీ) నష్టాలు అధికంగా ఉన్న జోన్లను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీటిని ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత 15 శాతం నష్టాలు దాటిన జోన్లన్నింటినీ క్రమంగా ప్రైవేటుపరం చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడతలో చార్మినార్, బేగంబజార్, నిజామాబాద్ జోన్లను ఫ్రాంచైజీలకు అప్పగించనున్నారు. ఇందుకోసం అధ్యయనానికి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాలకు వెళ్లింది. అత్యధిక విద్యుత్ నష్టాలున్న ఈ మూడు జోన్లతో ప్రారంభించి.. తర్వాతి దశల్లో మిగతా జోన్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు తెలిసింది. రాష్ర్టవ్యాప్తంగా ఈ విధానాన్ని విడతలవారీగా అన్ని ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే సమీప భవిష్యత్తులోనే రాష్ర్టంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థ మొత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.
పూర్తిగా వదిలించుకోవడమే!: ఫ్రాంచైజీ విధానమంటే పూర్తిగా ప్రైవేట్ సంస్థల పరం చేయడమే. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో మీటరింగ్, బిల్లింగ్ పనులు ఇప్పటికే ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గ్రామాల్లో సబ్‌స్టేషన్ల నిర్వహణను కూడా అవే చేపడుతున్నాయి. ఇక ఫ్రాంచైజీ విధానంలో మరో అడుగు ముందుకుపడుతుంది. మీటరింగ్, బిల్లింగ్‌తో మొదలు బిల్లు కలెక్షన్, నెట్‌వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం), కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు బాధ్యతలూ ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తారు. ఫ్రాంచైజీలకు ఇచ్చే జోన్లలో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవు. అంటే మొత్తం వ్యవహారం ప్రైవేటుపరమవుతుందన్నమాట! ఇందుకోసం కాంపిటేటివ్ బిడ్డింగ్‌తో ఫ్రాంచైజీ సంస్థను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఒక నిర్దేశిత ప్రాంతం(సింగిల్ పాయింట్)లో డిస్కంలు సరఫరా చేసే విద్యుత్‌ను రీడింగ్ ద్వారా లెక్కిస్తారు. ప్రస్తుతం సదరు ప్రాంతం నుంచి యూనిట్‌కు సగటున ఎంత ఆదాయం వస్తుందో
లెక్కిస్తారు. అంతకంటే ఎక్కువ ధర చెల్లించడానికి ముందుకొచ్చే కంపెనీకి ఆ ప్రాంతంలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను అప్పగిస్తారు. ఆపై సదరు ప్రాంతానికి డిస్కంలకు ఎలాంటి సంబంధం ఉండదు. ‘ఇన్‌పుట్ బేస్డ్’ పద్ధతిగా వ్యవహరించే ఈ విధానంలో ముందే నిర్ణయించిన ధరలకు విద్యుత్‌ను ఫ్రాంచైజీ సంస్థ కొనుగోలు చేస్తుంది. పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా సదరు సంస్థ లాభాలను ఆర్జించుకోవాల్సి ఉంటుంది. ఇలా 10 నుంచి 20 ఏళ్ల వరకు ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఈ కాలంలో సదరు ప్రాంతంలో ప్రైవేట్ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినప్పటికీ విద్యుత్ సంస్థల నుంచి కానీ, విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) నుంచి కానీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఎఫ్‌ఆర్‌పీలో భాగంగానే...
దేశవ్యాప్తంగా నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ(ఎఫ్‌ఆర్‌పీ)ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. కేంద్రం లెక్కల ప్రకారం తెలంగాణ డిస్కంల నష్టాలు రూ. 6 వేల కోట్లకుపైగానే ఉన్నాయి. ఈ ప్యాకేజీ కింద డిస్కంలకు ఉన్న రుణాల్లో సగం మొత్తానికి కేంద్రం, మిగిలిన సగానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ భారాన్ని కేంద్ర, రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ అమలుకు 2012 అక్టోబర్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతీ ఏటా చార్జీలు పెంచాలని, ఉచిత విద్యుత్‌ను కట్టడి చేయాలని, పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని ఆ మార్గదర్శకాల్లో షరతులు విధించింది. వీటిని పాటిస్తేనే ఎఫ్‌ఆర్‌పీ కింద డిస్కంలకు కేంద్రం నుంచి సహాయం అందుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం సందర్భంగా కేంద్రం షరతులను పాటిస్తామని ఈ ఏడాది జనవరి 1న(సమైక్య రాష్ట్రంలో) అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా ఈ సంస్కరణలను వేగవంతం చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది.