రాచకొండలో డిస్నీ వరల్డ్
* ‘సాక్షి’తో పేర్వారం రాములు
* తెలంగాణ పర్యాటకాభివృద్ధి
* సంస్థ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
* రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తెస్తా
* కేబీఆర్ పార్కులో‘లండన్ ఐ’ నిర్మిస్తాం
* హుస్సేన్‌సాగర్, నాగార్జునసాగర్‌లలో వాటర్‌వరల్డ్
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి వేళ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల చిత్రవిచిత్ర ఆకృతులు అలరిస్తాయి. గోరుకొయ్యలు, సప్తరుషి మండలం, ధ్రువతార... ఇలా వాటికి పేర్లెన్నో. రాత్రివేళ కొన్ని పక్షులు కిలకిలారావాలతో పలకరిస్తాయి. వాటితోపాటు ఇతర జంతుజాలం చేసే శబ్దవిన్యాసాలు ఆస్వాదిస్తూ నక్షత్ర భ్రమణాన్ని పరికిస్తుంటే ఆ అనుభూతే వేరు. కానీ నేటితరానికి వాటి మజానే తెలీదు. వీలు చిక్కితే సెల్‌ఫోన్లతో గడిపే యువత కు ఆ అనుభూతిని కలిగించాలనేది నా ఆకాంక్ష. దాన్ని పర్యాటక రంగ పురోగతితో ముడిపెట్టి ముందుకు తీసుకెళ్తా’ అని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు పేర్కొన్నారు. ఆదివారం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పేర్వారం తన ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డిస్నీవరల్డ్‌ను తెలంగాణకు తెప్పించటం, అద్భుతాల్లో అద్భుతంగా భావించే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను ఆవిష్కరించటం ఆయన ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. కేంద్రం అందించే పర్యాటక నిధులను గరిష్ట స్థాయిలో పొంది, రాష్ట్రప్రభుత్వ నిధుల వాటాను పెంచి రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపు, ఊపు తేవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....
* రాచకొండను ఫిల్మ్ స్టూడియోగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు 2 వేల ఎకరాల్లో డిస్నీ వరల్డ్ ఏర్పా టు చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని ఇక్క డ సాకారం చేసే ప్రతిపాదన చేస్తున్నాం.
* దాదాపు 565 అడుగుల ఎత్తుతో ఉండే లండన్ ఐ తరహా జెయింట్ ఫెర్రీస్ వీల్‌ను కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేయాలని ఉం ది. ఆరు ఎకరాల స్థలం దీనికి అవసరం. ఇందుకు 40 కోట్ల వరకు ఖర్చవుతుంది.
* భువనగిరి, రామగిరి ఖిల్లా, వికారాబాద్ అనంతగిరుల్లో పారాగ్లైడింగ్ ఏర్పాటు చేస్తాం.
* ఆదిలాబాద్-ఖమ్మం మధ్య గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న గుట్టల్లో ట్రెక్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
* మెదక్ జిల్లాలోని ఝరాసంగం, ఏడుపాయల గుడులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.
* హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన తర్వాత అందులో, నాగార్జునసాగర్‌లో నీటి అంతర్భాగంలో వాటర్ వరల్డ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.
* వరంగల్ జిల్లాలోని రామప్ప, పాకాల, లక్నవరం చెరువుల్లో వాటర్ స్కీయింగ్ ఏర్పాటు చేస్తాం.
* రాణీ రుద్రమదేవి కన్నుమూసిన నల్లగొండ జిల్లా చెందుపట్లను, కంచర్ల గోపన్న జన్మస్థలం నేలకొండపల్లిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తాం.