జిల్లావిద్యాశాఖలో నిఘానేత్రం | District Education surveillance enema | Sakshi
Sakshi News home page

జిల్లావిద్యాశాఖలో నిఘానేత్రం

Published Fri, Aug 7 2015 1:53 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM

District Education surveillance enema

 నల్లగొండ : ప్రభుత్వ పరిపాలన యంత్రాం గంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం కొత్త ఒరవడి సృష్టించింది. ప్రభుత్వ శాఖలు కనీ వినీ ఎరుగుని రీతిలో హైటెక్ పాలనకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. పారదర్శక పాలనే ధ్యేయంగా ఉద్యోగులు క్రమశిక్షణ తప్పకుండా విధులు నిర్వర్తించేం దుకు సీసీ కెమెరాల వాడకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు వినియోగించడం ద్వారా విద్యాశాఖ నిఘా నీడలోకి చేరింది. ఉద్యోగులు సైతం ఆశ్చర్యపడే విధంగా కార్యాలయంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం ఏర్పాటుచేసిన కెమెరాల నీడన పనిచేసేందుకు ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
 
 ఎంట్రెన్స్ టు చాంబర్...
 కార్యాలయంలోని ప్రధాన ముఖద్వారం నుంచి డీఈఓ చాంబర్ వరకు మొత్తం 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంట్లో మూడు కెమెరాలు ఆవరణలో ఏర్పాటు చేయగా...మిగిలిన కెమెరాలు ఉద్యోగులు పనిచేస్తున్న వివిధ విభాగాల్లో ఏర్పాటు చేశారు. మొదటి సీసీ కెమెరా పరీక్షల విభాగం కలిగిన భవనానికి పైభాగాన ఏర్పాటు చేశారు. కార్యాలయ ఆవరణలోకి అడుగుమోపగానే తొలుత ఈ కెమెరాలోనే రికార్డు అవుతారు. రెండో కెమెరా ‘బి’ వింగ్ భవనానికి పైబాగాన బయట ఉంచారు. మూడో కెమెరా డీఈఓ చాంబర్ పక్కనే ఉన్న ఆర్‌ఎంఎస్‌ఏ కార్యాలయానికి ఏర్పాటు చేశారు. మిగిలిన 13 కెమెరాలు ఉద్యోగులు పనిచేస్తున్న గదుల్లో ఉన్నాయి.
 
 ముందు జాగ్రత్త చర్య....
 విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ తర్వాతి హోదాలో ఇద్దరు ఏడీలు ఉన్నారు. కానీ వారినుంచి ఎలాంటి సహాయం తీసుకోలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో కూడా ఏడీల ప్రమేయం లేకుండానే చేశారు. దీంతో డీఈఓ తర్వాత కార్యాలయానికి పర్యవేక్షించే అధికారి మరొకరు లేకపోవడంతో గత్యంతర లేక సీసీ కెమెరాలను నమ్ముకోవాల్సి వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విధుల్లో భాగంగా డీఈఓ ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే కార్యాలయంలో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారు. వివిధ రకాల పనుల కోసం వచ్చేవారి నుంచి పలువురు ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కొంతమంది ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు.
 
 గత ఘటన పునరావృతం కాకుండా..
 ప్రధానంగా 2013 బదిలీల తర్వాత డీఈఓ కార్యాలయంలో ఇప్పుడున్న ‘బీ వింగ్’ భవనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుటించారు. పదోన్నతులు, బదిలీలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాలన్నీ బీ వింగ్‌లో భద్రపరుస్తారు. దీంతో అప్పట్లో డీఈవో కార్యాలయం తగలబడటం జిల్లాలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బదిలీలకు సంబంధించిన ఫైళ్లన్నీ కూడా ‘బీ వింగ్’లోనే భద్రపర్చారు. అదీగాక వచ్చే ఏడాది మార్చితో డీఈఓ పదవీ కాలం ముగుస్తుండటంతో కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ఆయన ఈ సీసీ కెమెరాలను అమర్చాల్సి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఉద్యోగుల హాజరు నమోదు చేసేందుకు బయెమెట్రిక్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు డీఈఓ శుక్రవారం ప్రకటించారు. హైటెక్ పోకడలతో సీసీ కెమెరాల ప్రయోగం మిగిలిన శాఖలకు ఆదర్శంగా నిలుస్తుందా..? లేకుంటే.. ఉద్యోగుల నుంచి విమర్శలకు దారితీస్తుందా..? అన్నది వేచిచూడాల్సిందే.  
 
 స్వీయ పర్యవేక్షణ కోసమే
 కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమశిక్షణ పాటించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దీంతో స్వీయ పర్యవేక్షణ ఉండటం వల్ల ఉద్యోగులు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించుకునే అవకాశం ఉంది. గతంలో గుర్తుతెలియని వ్యక్తులు డీఈఓ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కెమెరాల వాడకం అవసరం. అప్పుడప్పుడు అల్లరి మూకలు కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారు. కొందరు అడ్డాగా మార్చుకుని కాలక్షేపం చేసేందుకు వచ్చిపోతున్నారు. విద్యాశాఖ జాయింట్ డెరైక్టర్, డీఆర్వో అనుమతి తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.  
 - ఎస్.విశ్వనాథరావు, డీఈఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement