ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేజారింది. ఎన్నో దోబూచులాటల అనంతరం ఎట్టకేలకు.. ఆ పదవి పార్టీ విధేయుడు, సీనియర్ నాయకుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు వరించింది. దీంతో ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి భంగపడ్డారు.
సాక్షి, మహబూబ్‌నగర్ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి అనూహ్యంగా కాషాయం కండువా కప్పుకోవడంతో బీజేపీ బలోపేతం కావడంతో పాటు.. వరుసగా జరిగిన పార్లమెంట్, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆపారీ్టఅభ్యర్థులు అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో వీరిద్దరి పేర్లు కూడా వినిపించాయి. జితేందర్‌రెడ్డి అయితే ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యే భాగ్యం తనకూ ఉందని కార్యకర్తల సమావేశంలోనే చెప్పారు. అప్పట్లోఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి ఈ సారి అధిష్టానం ఆశీస్సులు ఉంటాయనే ప్రచారం జరిగింది. (బీజేపీ బండికి.. సంజయుడే సారథి)
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఆయన పార్టీ పార్లమెంటు పక్షనేతగా పని చేసినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పార్టీ నాయకులతో ఆయన పరిచయాలు మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. గతేడాది మార్చి 27న.. టీఆర్‌ఎస్ ఎంపీగా కొనసాగుతూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో జితేందర్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి హామీ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీలో చేరిన తర్వాత జితేందర్‌రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా అనేక పర్యాయాలు అధిష్టానాన్ని ఆకర్షించేలా సీఎం కేసీఆర్ పని తీరును తీవ్రంగా విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?)
మరోవైపు సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నా.. ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. తన ముఖ్య అనుచర వర్గాల ముందు మాత్రమే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని చెప్పారు. అయితే ఒకానొక దశలో ఈసారి అధ్యక్ష పదవి రాష్ట్రంలో మహిళకే ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో అది కచ్చితంగా డీకే అరుణకే వరిస్తుందని బీజేపీ శ్రేణులు చర్చించుకున్నాయి. ఆమె పారీ్టలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతానికి పట్టుసడలని కృషి చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో నిర్మిస్తోన్న రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు రెండ్రోజుల క్రితమే మద్దతు తెలిపారు. (కార్పొరేటర్ నుంచి ఎంపీగా.. సంజయ్ ప్రస్థానం)
ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పని తీరును విమర్శించారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌పై, ప్రజా వ్యతిరేక విధానాలపై గత గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా.. రాష్ట్ర పదవి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్లకు చేజారడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త నైరాశ్యం కలిగింది. అయితే వీరిద్దరి మినహా పార్టీలో చాలా మంది సీనియర్లు ఉండడం.. తాజా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేరు సైతం బలంగా వినిపించింది. ఇందులో జితేందర్‌రెడ్డి, డీకే అరుణలకు పార్టీలో సీనియార్టీ లేకపోవడం.. ఒకవేళ వీరిలో ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తే మిగిలిన సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో అధిష్టానం ఆ పదవిని ఆరెస్సెస్‌లో సేవకుడిగా పని చేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగిన ఎంపీ బండి సంజయ్‌కు అప్పగించినట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. అయితే డీకే అరుణ, జితేందర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని, భవిష్యత్‌లో మంచి పదవులు వరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment