
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల ఆందోళన కేసులో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ను ఈనెల 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంతర ఆదేశాలను పొడిగించింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసీలు చేసిన ఉద్యమానికి సహకరించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో తనపై 25కు పైగా అక్రమ కేసులు నమోదు చేశారని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ గతంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు అధికారి సేకరించిన వివరాల్లో ప్రేమ్‌సాగర్ ఆర్థిక సాయం చేస్తామని చెప్పినట్లు లేదని, ఇలాంటి కేసుల్లో అరెస్టు చేసి విచారించాల్సిన అవసరమేలేదని ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను 30 వరకు పొడిగించింది.