ప్రాణం తీసిన ఒక్క రూపాయి | One rupee that took life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఒక్క రూపాయి

Published Sun, Jun 2 2024 5:19 AM | Last Updated on Sun, Jun 2 2024 5:19 AM

One rupee that took life

రూ.59 బిర్యానీకి రూ.60 చెల్లించిన ఆటోడ్రైవర్‌ 

రూపాయి ఎక్కువ ఇచ్చేమగాడివా.. అంటూహేళన చేసిన స్నేహితుడు 

ఇద్దరి మధ్య ఘర్షణలో ప్రాణం కోల్పోయిన ఆటో డ్రైవర్‌ 

వరంగల్‌లో ఘటన  

ఖిలా వరంగల్‌: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్‌ నువ్వు ఒక ఆటోడ్రైవర్‌వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్‌ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్‌ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్‌ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్‌ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్‌ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్‌ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్‌ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. 

దీంతో ప్రేమ్‌సాగర్‌ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. 

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్‌ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్‌ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్‌ మృతిచెందాడు. వెంటనే అరవింద్‌ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement