రాజకీయం చేయొద్దు
► గ్యాంగ్‌రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తాం
► ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖ రాశాం
► మహిళలపై సమాజంలో మార్పు రావాలి
► ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల
కరీంనగర్ సిటీ : వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి(20)పై గ్యాంగ్‌రేప్ ఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వ పరంగా బాధితురాలికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, రెండుమూడు నెలల్లో తీర్పు వచ్చేలా చూడాలని జడ్జికి లేఖ రాసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతనెల 26న రాత్రి 8 గంటలకు గ్రామస్తుల ద్వారా తనకు విషయం తెలిసిందని, వెంటనే ఎస్పీకి ఫోన్‌చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించానని తెలిపారు. మరుసటి రోజు గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చానన్నారు.
ఇలాంటి ఘటనలను రాజకీయాలకతీతంగా చూడాలని, పునరావృతం కాకుండా చర్యలకు సహకరించాలని కోరారు. కాని పరిపాలనా అనుభవం ఉన్న వాళ్ల తీరు చూస్తుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కన్నా రాజకీయ కోణంలోనే మాట్లాడినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ కేసును ఎస్పీ జోయల్ డేవిస్ స్వయంగా విచారిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్నారు. నిందితుల్లో అంజయ్య, రాకేశ్‌లు సర్టిఫికెట ప్రకారం మైనర్లని, వైద్యపరీక్షల ద్వారా అంజి మేజర్ అని తేలిందని, రాకేశ్ వయస్సు తేలాల్సి ఉందని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలు నిండిన వాళ్లను కూడా మేజర్ల తరహాలోనే విచారిస్తారన్నారు.
సామాజిక ఉద్యమాలు రావాలి..
ఢిల్లీ నుంచి గల్లీ దాకా లైంగికదాడులు పెరిగిపోతున్నాయని మంత్రి ఆవేదన చెందారు. వీటిని అరికట్టాలంటే కేవలం శిక్షలతోనే సరిపోదని, మానవ విలువలను పెంచేలా సమాజంలో మార్పు రావాలని అన్నారు. సినిమా, సెల్‌ఫోన్, టీవీల్లో అశ్లీల దృశ్యాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దన్నారు. గతంలో సారాకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చినట్లు ఇలాంటి ఘటనలపై సామాజిక ఉద్యమం రావాలని అయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.