సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మర్డర్ కేసును మాఫీ చేసుకునేందుకు.. డబ్బులు కావాలి. లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి బాధితులను రాజీ చేసుకోవాలి. లేకుంటే శిక్ష పడుతుంది. మరి అంత డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి.. ఏదో ఒకటి చేయాలి. డబ్బులున్న బడా వ్యాపారినో.. డాక్టర్‌నో.. పారిశ్రామికవేత్తనో కిడ్నాప్ చేయాలి. అచ్చం.. ఇదే కోణంలో తమకున్న నేర ప్రవత్తితో కత్తులు నూరిందొక రౌడీ గ్యాంగ్. ఓ కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసింది.
ఓ పేషెంట్ ఆపదలో ఉన్నట్లు నాటకమాడి.. డాక్టర్‌కు ఫోన్ చేసింది. అనుకున్నట్లుగానే ఆ రహదారిపై వచ్చిన డాక్టర్ ఆ గ్యాంగ్ స్కెచ్‌లో ఇరుక్కున్నాడు. వరంగల్-కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సంచలనం రేపిన చిల్డ్రన్స్ స్పెషలిస్టు, ఎల్కతుర్తి డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త కోణమిది. వరంగల్ నగరానికి చెందిన రౌడీషీటర్ ఫయీమ్ గ్యాంగ్ డాక్టర్‌ను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందులో ఎవరెవరున్నారు.. ఎంత మంది పాల్గొన్నారు.. డాక్టర్‌ను కిడ్నాప్ చేయటం వెనుక అసలు కారణమేమిటనే... కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.
దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2013, మార్చి 9న ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లో గొట్టెముక్కుల పాపిరెడ్డి హత్య జరిగింది. ఇంటి దారి వివాదం చినికిచినికి గాలివానగా మారి ఈ హత్యకు దారి తీసింది. అదే గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల శ్రీనివాస్ నడిరోడ్డుపై పాపిరెడ్డిని కత్తులతో పొడిచి చంపినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. తీర్పు వచ్చే లోగా ఈ కేసులో రాజీ చేసుకునేందుకు శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.
బాధిత కుటుంబీకులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఈ కేసు నుంచి బయటపడాలనుకున్నాడు. అంత డబ్బు సంపాదించేందుకు కొత్త పథకం పన్నాడు. తనకు ఉన్న పాత పరిచయాలు.. అప్పటి హత్యకు సహకరించిన రౌడీషీటర్ ఫయూమ్ గ్యాంగ్‌ను కలిశాడు. రోజూ హన్మకొండ నుంచి హుజురాబాద్‌కు వెళ్లే డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్‌నకు పథకం పన్నాడు. తమ గ్యాంగ్‌లో ఉన్న హన్మకొండకు చెందిన కడారి రాజు, ఎల్కతుర్తి సమీపంలోని దండెపల్లికి చెందిన ఎలబోయిన రమేశ్, హన్మకొండకు చెందిన దీపక్ సాయంతో కిడ్నాప్ ఎత్తుగడను పక్కాగా అమలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సుబేదారి పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో కడారి రాజు, రమేశ్ రౌడీషీటర్లుగా ఉన్నారు. గత ఏడాది వరంగల్‌లో జరిగిన బొంగు కుమార్ హత్య కేసులో ఫయూమ్‌తోపాటు రాజు పేరు వెలుగులోకి వచ్చింది. నాయుడు పెట్రోల్ బంక్‌పై దాడి.. విధ్వంసానికి యత్నం చేసిన ఘటనలోనూ ఈ గ్యాంగ్ సభ్యులందరి పేర్లు పోలీసు రికార్డుల్లోకెక్కాయి. దీపక్ జనగాం ప్రాంతానికి చెందినవాడని.. కొంతకాలంగా హన్మకొండలో ఉంటూ ఫయీమ్ గ్యాంగ్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
డాక్టర్ కిడ్నాప్‌లో ఈ నలుగురే ఉన్నారా..? ఫయీమ్ స్వయంగా పాల్గొన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కిడ్నాపర్ల ముఠా ఎన్ని డబ్బులు వసూలు చేసింది..? డబ్బును ఏం చేసింది..? తనను బంధించిన నలుగురు కిడ్నాపర్లు ఎవరో ఒకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఎవరు..? ఈ గ్యాంగ్‌కు లీడర్ ఫయీమేనా..? లేదాఎవరైనా డాక్టర్‌కు గిట్టని ప్రత్యర్థులు ఈ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించారా..? అనేది మిస్టరీగా మారింది.
నాడు మర్డర్.. నేడు కిడ్నాప్
Published Tue, Oct 7 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement