
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏదైనా ఊహించని ఘటన జరిగినప్పుడు హడావుడిగాకమిటీలు వేయడం.. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు విచారణల పేరుతో సాగదీయడం వైద్య ఆరోగ్యశాఖలో పరిపాటిగా మారింది.ఒక వేళ ఫలానా ఘటనకు ఫలనా వైద్యుడు, అధికారి బాధ్యుడని కమిటీ రిపోర్టులో స్పష్టం చేసినా పట్టించుకున్నది లేదు.. చర్యలు తీసుకున్నదీ లేదు. రోగుల జీవితాలతో ఆడుకుంటున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే ఆయా ఘటనలపై కమిటీలు సమర్పించిన నివేదికలను బుట్టదాఖలు చేస్తుండటంపై అనేక అనుమానాలు, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కడుపులో కత్తెర మరిచినా..
ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యుల నిర్వాకం ఇది. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు సర్జరీ చేశారు. తర్వాత తరచూ ఆమెకు కడుపునొప్పి వస్తుండటంతో మళ్లీ ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యలు సర్జరీ సమయంలో కడుపులో కత్తెర మరిచినట్లు గుర్తించి.. వెంటనే ఆమెకు మరోసారి సర్జరీ చేసి కడుపులోని కత్తెర తొలగించారు. దాంతో రోగికి ప్రాణాపాయం తప్పింది. ఈ అంశం పెద్ద సంచలనంగా మారడంతో ఆస్పత్రి పాలకవర్గం ముగ్గురు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. కడుపులో కత్తెర మరిచిన ఘటనకు ఓ నర్సును బాధ్యురాలిని చేసి.. సర్జరీ చేసిన వైద్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఆస్పత్రిలో ఇటీవల ఓ యువ వైద్యుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. న్యూరాలజీ విభాగాధిపతి వేధింపులే ఇందుకు కారణమని, సంబంధిత వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ డాక్టర్లంతా ఆందోళనకు దిగారు. నిజనిర్థారణ కోసం నిమ్స్ డైరెక్టర్ ఓ అత్యున్నత స్థాయి కమిటీ వేశారు. సంబంధిత కమిటీ యువ వైద్యుడి మృతికి దారితీసిన అంశాలపై సమగ్ర రిపోర్టు అందజేసింది. రెసిడెంట్ వైద్యుల సంరక్షణ కోసం సంస్థాగతంగా చేపట్టాల్సిన పలు చర్యలను సూచించింది. కేసు నుంచి బాధ్యులను తప్పించడమే కాకుండా కమిటీ సిఫార్సుల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు.
పిల్లలు తారుమారైనా..తల్లులు చనిపోయినా..
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు సర్జరీ వికటించింది. దీంతో ఆమెను ఉస్మానియాకు తరలించడంతో ఆమెకు అక్కడి వైద్యులు ప్రాణం పోశారు. ఇక సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో తరచూ పిల్లలు మారుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు కారణమైన వైద్య సిబ్బందిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నది లేదు. నిలోఫర్ ఆస్పత్రిలో రెండున్నరేళ్ల క్రితం ఆరుగురు బాలింతలు మృతి చెందారు. ఈ అంశంపై అప్పట్లో అసెంబ్లీ వేదికగా పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కమిటీ రిపోర్టు ఇచ్చినా.. ఇప్పటి వరకు సంబంధిత వైద్యులపై చర్యలు లేవు.
పారాసిటమాల్‌కు బదులు ‘ట్రెమడాల్’
ఇటీవల నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో పెంటావాలెంట్ వ్యాక్సిన్ వేయించుకున్న శిశువులకు పారసిటమాల్‌కు బదులు ట్రెమడాల్ మాత్రలు ఇచ్చి ఇద్దరు శిశువుల మృతికి, మరో 37 మంది శిశువుల అస్వస్థతకు కారణమయ్యారు. అప్పట్లో ఈ అంశాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రాధమిక నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ సహా ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్ట్‌లను సస్పెండ్ చేశారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తుకు కమిటీ వేయగా నివేదిక అందజేసింది. వాక్సినేషన్‌పై సిబ్బందికి శిక్షణ ఇప్పించడంలోనూ, వాక్సినేషన్ తీరును పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క రెగ్యులర్ అధికారిపై కానీ వైద్యుడిపై గానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
16 మంది కంటిచూపు దెబ్బతిన్నా..
సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స వికటించి 16 మంది కంటిచూపు పోయింది. ఆర్‌ఎల్ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్లే కంటిచూపు దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. సెలైన్‌వాటర్‌తో కళ్లను శుభ్రం చేసి, రోగుల చూపును కోల్పోవడానికి కారణమైన వైద్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వైద్యులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే కారణంతో ఉద్దేశపూర్వకంగానే వైద్యుల తప్పిదాలను కప్పిపు చ్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉస్మానియా ఆస్పత్రిలో ఒకరికి బదులు.. మరొకరు విధులు నిర్వహిస్తుండటం, చాలామంది ఉద్యోగులు ఆస్పత్రికి రాకుండానే వచ్చినట్లు సంతకాలు చేసి నెలసరి వేతనాలు పొందుతుండటంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు.