
సాక్షి,హైదరాబాద్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష ఆందోళనలకు దిగడమే అమరుడు దొడ్డి కొమరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గతంలో వెట్టిచాకిరీ రూపంలో అణచివేత ఉంటే, ఇప్పుడు ప్రజాస్వామ్య ముసుగులో పరోక్షంగా అది కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్థంతి సందర్భంగా శనివారం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమరయ్య చిత్రపటానికి పార్టీనాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, వీఎస్ బోస్, డా. సుధాకర్, ఈటీ నర్సింహ పూలమాలలేసి నివాళులర్పించారు.
అణచివేత సాధ్యం కాదు
భూస్వాములు, పెట్టుబడిదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో తిరుగుబాటుతత్వాన్ని అణచివేయడం సాధ్యం కాదని తెలంగాణ సాయుధపోరాటం గుర్తుచేస్తోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రైతుసంఘం కార్యాలయంలో కొమరయ్య చిత్రపటానికి మల్లారెడ్డి, టి.సాగర్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
టీఎన్‌జీవోల నివాళి
దొడ్డి కొమరయ్యకు టీఎన్‌జీవో నేతలు నివాళులు అర్పించారు. టీఎన్‌జీవోల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కొమరయ్య అమరత్వం రాష్ట్ర ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైందన్నారు.