
అనవసరంగా నోరు జారొద్దు: కేకే
రాజకీయాల్లో అనవసరంగా నోరు జారొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అనవసరంగా నోరు జారొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలను టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావుతో కలిసి తెలంగాణభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 1,200 మంది విద్యార్థులు అమరులైతే ఏనాడూ రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేయించలేని అసమర్థ మం త్రులు ఇప్పుడు జై తెలంగాణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్‌కు నీళ్లు రాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు అడ్డుకుంటే ఆ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగలరా? అని ప్రశ్నించారు. జాతీయ పార్టీల చేతిలో తెలంగాణ ఉంటే నదీజలాలు, ఉద్యోగాలు వంటి చాలా సమస్యలు శాశ్వతంగా ఉంటాయని హెచ్చరించారు. కొందరు బాధపడినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే అంతిమలక్ష్యంగా పోరాడే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించడానికి ముందుగా హుందాగా మెలగాలని కాంగ్రెస్ నేతలకు కేకే సూచించారు.
బాబుది నాలుకేనా?: హరీష్‌రావు
నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుది నాలుకా, తాటిమట్టా అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని నిన్నటివరకు చెప్పిన చంద్రబాబే ఇప్పుడు టీఆర్‌ఎస్ విలీనం కాకుండా నమ్మకద్రోహం చేసిందంటూ విచిత్రంగా వాదిస్తున్నాడని చెప్పారు. టీఆర్‌ఎస్ ఒంటరిపోరుకు సిద్ధమైందని ప్రకటించగానే కాంగ్రెస్‌కు, టీడీపీకి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వంత రాష్ట్రమని, టీడీపీ వంటి పరాయి రాష్ట్రాల పార్టీల అవసరం ఇక్కడ లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌కు అధిష్టానమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు.
సీపీఐతో చర్చలు
సీట్ట సర్దుబాటుపై సీపీఐతో చర్చలు జరుగుతున్నాయని టీఆర్‌ఎస్ పొత్తుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.కేశవరావు వెల్లడించారు. పొత్తుల వివరాలను ఇప్పుడే మీడియాకు చెప్పలేమన్నారు.