బాబుది కాంగ్రెస్ డీఎన్‌ఏనే.. | don't believe tdp president nara chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుది కాంగ్రెస్ డీఎన్‌ఏనే..

Published Tue, Apr 15 2014 4:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

don't believe tdp president nara chandrababu Naidu

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ :కాంగ్రెస్‌ను తరిమికొడదామంటున్న చంద్రబాబు డీఎన్‌ఏ కాంగ్రెస్ అన్న విషయం అందరికీ తెలిసిందేనని, వెయ్యి మంది బాబు లు, మరో వెయ్యి మంది మోడీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. హన్మకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అంటే కిలాడి చంద్రశేఖర్‌రావు అని, ఆయన టక్కు టమా రా, గోకర్ణ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని అన్నారు.
 
ఆయన దురహంకారణ ధోరణి పరాకాష్టకు చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా సోనియా ఇంటికి వెల్లిన కేసీఆర్ తన ముఖ్య అనచరులను సైతం పక్కన పెట్టాడని అన్నారు. తెలంగాణ ఏర్పడితే గొంగళి పురుగును ముద్దాడుతానని, టెన్ జన్‌పథ్‌లో అటెండర్‌గా పనిచేస్తానని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. నేడు సీఎం పదవి కోసం మాట మార్చాడని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇటీవల జరిగిన సభ వెలవెలపోయిందని చెప్పారు.
 
బడుగు, బలహీన వర్గాలకు న్యాయం, సుపరిపాలన, మన ఉద్యోగాలు, మన వనరులు మనకే చెందాలంటే కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందన్నారు. బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో ఏర్పాటు చేసిందన్నారు. పీసీసీ చీఫ్ పొన్నాలపై విమర్శలు చేస్తున్న కేసీఆర్.. పార్టీలో రైట్ హ్యాండ్‌గా ఉన్న కర్నె ప్రభాకర్, శ్రవణ్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఎందుకు బయటికి వస్తున్నారో అందరికీ తెలిసిందేనని అన్నారు. 119 ఎమ్మేల్యే సీట్లలో 70 నుంచి 80 వరకు కాంట్రాక్టర్లకు కేసీఆర్ అమ్ముకున్నాడని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.
 
బీజేపీతో జతకలిసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, థర్డ్‌ఫ్రంట్ అంటున్న కేసీఆర్‌లది గురుశిష్యుల బంధంలా ఉందన్నారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని, బీజేపీ ‘భారత్ కా జూటా పార్టీ’ అని ఆయన విమర్శించారు. మసీదులు కూల్చిన వారితో పొత్తులు కలుపుకోవడం శోచనీయమన్నారు. పొత్తులపై రెండు పార్టీలూ పునరాలోచించుకోవాలని సూచించారు.
 
పార్టీలో నిబద్ధత గల వ్యక్తి దొంతి

డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. తనకు కూడా పార్టీ బీఫాం వచ్చిందని, అయితే పార్టీ అధిష్టానం సూచన మేరకు తప్పుకున్నానని సుధాకర్‌రెడ్డి చెప్పారు. పార్టీ నుంచి రెబల్ గా పోటీ చేసే వ్యక్తులు మరోసారి పునఃపరిశీ లించుకోవాలని, 16న కరీంనగర్‌లో జరిగే సోనియాగాంధీ సభకు వారి అనుచరగణంతో తరలిరావాలని కోరారు.
 
 తెలంగాణవాదులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివ చ్చి సోనియాగాంధీ వెంట మేమున్నామని చూపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పరకాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, రేపల్లె శ్రీనాద్, దరిగె నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement