సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు.
మంగళవారం ప్రగతిభవన్‌లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కోటి మొక్కలు..
రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు.
మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.
మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్‌తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు.
పథకాల అమలులో మనమే ఫస్టు
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు.
రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్‌గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు.
జూన్ 10 నుంచి హరితహారం
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్‌కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు.
అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్‌ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 451, పీఆర్‌కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
‘భగీరథ’ వేగం పెంచండి
ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్‌పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు.
ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు.
అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు
‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్‌ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్‌ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అటవీ అధికారుల నిర్లక్ష్యంతో..
ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు.
రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు.
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
Published Wed, May 18 2016 8:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement