జీతాలకు ఢోకా లేదు
నగదుగా చెల్లించేందుకు మాత్రం వీలుకాదు: ఈటల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఢోకా లేదని.. జీతాలు ఆపాలన్న ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అరుుతే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా జీతాలు నగదు రూపంలో ఇచ్చేందుకు ఆస్కారం లేదని తెలిపారు. మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. నోట్ల రద్దుతో తెలంగాణకు ఎంత నష్టమో, పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో తేలేందుకు సమయం పడుతుందని... అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకొని ఓపిక పట్టాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని... నల్లధనం పేరుతో మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు.
ప్రజల అవస్థలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. భారీ మొత్తంలో నోట్ల ముద్రణకు సమయం పడుతుందని, ప్రజలకు చేరటం ఆలస్యమవుతోందని ఈటల చెప్పారు. అందువల్ల పరిస్థితి మెరుగుపడేదాకా పాత కరెన్సీని కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి అవకాశమివ్వాలని కోరినా.. కేంద్రం అనుకూలంగా లేదని, అవి ప్రభుత్వ అధీనంలో లేవనే అభిప్రాయంతో ఉందని తెలిపారు.
నగదుగా చెల్లించండి: ఉద్యోగ సంఘాలు
డిసెంబర్ ఒకటో తేదీన చెల్లించే జీతాలను నగదు రూపంలో ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో ప్రతినిధులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, రాజేందర్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారని, వచ్చేనెల వేతనాన్ని నగదు రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలా కుదరని పక్షంలో కనీసం రూ.10 వేలు అరుునా నగదుగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కొత్త జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు పాత జిల్లాల స్థారుు హెచ్‌ఆర్‌ఏను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.