ఎన్టీపీసీ రామగుండం దూరదర్శన్ రిలే కేంద్రం
జ్యోతినగర్ (రామగుండం): రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రసారాలను అందించిన 19 ప్రసార భారతి దూరదర్శన్ కేంద్రాలు మరో వారం రోజుల్లో మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రసార భారతి డైరెక్టరేట్ జనరల్ నుంచి ఆయా దూరదర్శన్ కేంద్రాలకు ఉత్తర్వులు అందాయి. లోపవర్ ట్రాన్స్‌మీటర్/ వెరీ లోపవర్ ట్రాన్స్‌మీటర్ ప్రసారాలను నెలాఖరులో నిలుపుదల చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూతపడే వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 ఏళ్ల నుంచి ప్రసారాలను అందిస్తున్న 5 కేంద్రాలు ఉన్నాయి. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లో 1989లో ఏర్పాటు చేసిన దూరదర్శన్ కేంద్రం ద్వారా రామగుండం, గోదావరిఖని ప్రాంతంతో పాటు 40 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు దూరదర్శన్ ప్రసారాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైనప్పటి నుంచి యాదగిరి పేరుతో ప్రసారాలు అందిస్తున్నారు.
పోర్టబుల్ టీవీలకు తప్పని ఇబ్బందులు
దూరదర్శన్ కేంద్రాలను ఎత్తివేసినప్పటికీ డిజిటలైజేషన్ సాయంతో నాణ్యమైన ప్రసారాలు రానున్నట్లు సమాచారం. కానీ పోర్టబుల్ టెలివిజన్లకు డిజిటల్ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది. సిగ్నల్స్ అందుకునే సామర్థ్యం బ్లాక్ అండ్ వైట్ టీవీలకు సాధ్యమా..అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డేటా లేకుండా ప్రసారాలను చూడవచ్చని చెబుతున్నందున, ఎఫ్‌ఎం తరహాలో మొబైల్ ప్రసారాలకు ఆదరణ లభించే అవకాశం ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే దూరదర్శన్ చూస్తున్నట్లు సర్వేలో తేలడంతోనే కేంద్రాల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మూతపడనున్న దూరదర్శన్ ట్రాన్స్‌మీటర్లు 19
భద్రాచలం, భైంసా, గద్వాల, జడ్చర్ల, కరీంనగర్, కొల్లాపూర్, కోస్గి, మిర్యాలగూడ, మాడ్గుల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సిద్దిపేట, సిరిసిల్ల, తాలకొండపల్లి, వేములవాడ, వనపర్తి, యెల్లందు.
Comments
Please login to add a commentAdd a comment